నేపాల్ వరదల్లో తెలుగు ఎన్నారై కుటుంబం గల్లంతు

Telugu NRI family missing in Nepal floods
  • లండన్‌లో స్థిరపడ్డ సంతోష్ కుమార్ కుటుంబం
  • వీరి స్వస్థలం విజయనగరం జిల్లా పార్వతీపురం
  • మానస సరోవర్ యాత్రకు వెళుతుండగా విరుచుకుపడ్డ వరద

నేపాల్‌లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య శుక్రవారం మధ్యాహ్నానికి 469కి చేరుకోగా, ముప్పు ఇంకా తొలగిపోలేదని అధికారులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు, విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణానికి చెందిన ఒక ప్రవాసాంధ్ర (ఎన్నారై) కుటుంబం మానస సరోవర యాత్రలో వరద నీటిలో గల్లంతవ్వడం తీవ్ర శోకాన్ని నింపింది.


పార్వతీపురం పండా వీధికి చెందిన సుభాష్ చంద్ర సాహూ పెద్ద కుమారుడు సంతోష్ కుమార్ సాహూ (47) గత 20 ఏళ్లుగా లండన్‌లో స్థిరపడ్డారు. తాజాగా ఆయన తన భార్య సురభి (43), కుమారుడు స్పందన్ (18), కుమార్తె సైనా (13)లతో కలిసి లండన్ నుంచి నేపాల్ మార్గంలో మానస సరోవర్ యాత్రకు బయలుదేరారు. యాత్రలో భాగంగా వీరంతా ప్రయాణిస్తున్న వాహనం ఓ వంతెన దాటుతుండగా ఒక్కసారిగా విరుచుకుపడిన వదర ఉద్ధృతికి ఊహించని రీతిలో వంతెన కొట్టుకుపోయింది.


ఈ విషాద సమాచారాన్ని స్థానిక నేపాల్ గైడ్ సంతోష్ బంధువులకు అందించాడు. ఇప్పటివరకు ఆ వాహనం గానీ, కుటుంబ సభ్యుల ఆచూకీ గానీ లభించకపోవడంతో బంధువులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సంతోష్ తల్లిదండ్రులు ప్రస్తుతం సౌతాఫ్రికాలో ఉంటున్న తమ రెండో కుమారుడి వద్ద ఉండగా, బిడ్డలు, మనవళ్లు ఆకస్మిక ప్రళయంలో గల్లంతయ్యారన్న వార్త విని కన్నీరుమున్నీరవుతున్నారు.

Advertisement
Santosh Kumar Sahoo
Nepal Floods
Telugu NRI Missing
Manasa Sarovar Yatra
Parvathipuram Vizianagaram
Nepal Flash Floods

More Telugu News