పచ్చదనం సంకల్పాన్ని నాగబాబు సమర్థంగా నెరవేర్చాలి: పవన్ కల్యాణ్
- ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన నాగబాబు
- రాష్ట్రంలో పచ్చదనాన్ని 50 శాతానికి పెంచడమే లక్ష్యమన్న పవన్
- ఈ భారీ ప్రాజెక్టును నాగబాబు సమర్థవంతంగా ముందుకు తీసుకెళతారని వ్యాఖ్య
ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్‌గా జనసేన ఎమ్మెల్సీ నాగబాబు కేబినెట్ హోదాతో బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నాగబాబుకు ఆయన సోదరుడు, రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పచ్చదనంతో కళకళలాడే ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించాలనే ఆశయంతో కూటమి ప్రభుత్వం ఈ ప్రత్యేక నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసిందని, ప్రకృతిపై ఎంతో ప్రేమ ఉన్న నాగబాబు ఈ బృహత్తర బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
2047 నాటికి రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో పచ్చదనాన్ని ఏకంగా 50 శాతానికి పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ భారీ ప్రాజెక్టును నాగబాబు ముందుకు తీసుకెళతారని పవన్ పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణను కేవలం ఒక ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ఒక ప్రజా ఉద్యమంగా మలిచే బాధ్యతలో ఆయన పూర్తి విజయం సాధించాలని ఆకాంక్షించారు.
మరోవైపు, నాగబాబుకు కేబినెట్ హోదా కల్పిస్తూ ఏపీ గ్రీన్ కమిటీ ఛైర్మన్‌గా నియమించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకి, అందుకు మద్దతు తెలిపిన కూటమి భాగస్వామ్య పక్షాల నాయకులకు పవన్ కల్యాణ్ ఎక్స్ వేదికగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.