ప్రజల నుంచి వాట్సాప్ ద్వారా దరఖాస్తులు వచ్చినా పరిష్కరించాలి: అధికారులకు మంత్రి జూపల్లి ఆదేశం

Jupally Krishna Rao orders officials to resolve public grievances received via WhatsApp
  • ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ నెలల తరబడి తిరిగే పరిస్థితి ఉండకూడదన్న జూపల్లి
  • ప్రజల దరఖాస్తులకు వారం రోజుల్లోగా పరిష్కారం చూపాలని ఆదేశం
  • అధికారులు పాత పనితీరును మార్చుకోవాలని హెచ్చరిక

ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ నెలల తరబడి తిరిగే పరిస్థితి ఉండకూడదని... వాట్సాప్ లేదా ఈమెయిల్ ద్వారా దరఖాస్తు పంపినా అధికారులు తక్షణమే స్పందించాలని తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. పానగల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన ప్రజా సమస్యల సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత రెండున్నర ఏళ్లుగా ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులు, వాటి పరిష్కారంపై అధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు.


ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ప్రజలు తమ రోజువారీ పనుల్లో బిజీగా ఉంటారని, అందుకే పేరు, చిరునామా, ఫోన్ నంబర్‌తో కూడిన రాతపూర్వక ఫిర్యాదును వాట్సాప్ లేదా ఈమెయిల్ ద్వారా సంబంధిత అధికారులకు పంపవచ్చని వెల్లడించారు. అధికారులు ఆ దరఖాస్తులను ప్రింట్ తీసుకుని వెంటనే పరిశీలించాలని ఆదేశించారు. ప్రజలు ఇచ్చే దరఖాస్తులకు గరిష్ఠంగా వారం రోజుల్లో పరిష్కారం చూపాలని, ముఖ్యంగా విద్యార్థులకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలను రెండు మూడ్రోజుల్లోనే జారీ చేయాలని స్పష్టమైన గడువు విధించారు.


అధికారులు తమ పాత పనితీరును మార్చుకోవాలని, ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని జూపల్లి సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు.

Advertisement
Jupally Krishna Rao
Telangana Government
WhatsApp Grievance Redressal
Panagal Mandal
Public Issue Resolution
Telangana Excise Minister

More Telugu News