అమెరికా నుంచి 'ఫైర్ అండ్ ఫర్గెట్' జావెలిన్ క్షిపణుల కొనుగోలుకు భారత్ మొగ్గు
- జావెలిన్ యాంటీ ట్యాంక్ క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేయడానికి సిద్ధమవుతున్న భారత్
- ఆటోమేటెడ్ గైడెన్స్ మెకానిజంతో పని చేసే జావెలిన్ క్షిపణులు
- భారత సైనిక రంగానికి భారీ ఊతం ఇవ్వనున్న అత్యాధునిక క్షిపణులు
సైనిక సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా భారత్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా నుంచి అత్యాధునిక 'ఫైర్ అండ్ ఫర్గెట్' సాంకేతికత కలిగిన 'జావెలిన్' (Javelin) యాంటీ ట్యాంక్ క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేయడానికి భారత్ సిద్ధమవుతోంది. భారత సాయుధ దళాల ఆధునికీకరణలో భాగంగా ఈ ప్రతిపాదిత రక్షణ ఒప్పందం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.
భుజంపై నుంచి ప్రయోగించే ఈ జావెలిన్ క్షిపణి వ్యవస్థ ఆటోమేటిక్ గైడెన్స్ మెకానిజంతో పనిచేస్తుంది. దీనివల్ల క్షిపణిని ప్రయోగించిన తర్వాత అది టార్గెట్‌ను స్వయంగా గుర్తించి దెబ్బతీస్తుంది. అదే సమయంలో, క్షిపణి ప్రయోగించిన సైనికుడు శత్రువుల దాడి నుంచి తప్పించుకోవడానికి లేదా సురక్షిత ప్రాంతంలో తలదాచుకోవడానికి తగిన సమయం లభిస్తుంది.
ఎత్తైన పర్వత ప్రాంతాలు, సరిహద్దు వద్ద శత్రుదేశాల ట్యాంకులు, సాయుధ వాహనాలను సమర్థవంతంగా అడ్డుకోవడానికి ఈ జావెలిన్ క్షిపణులు అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తాయి. భారత సరిహద్దుల్లో రక్షణను మరింత కట్టుదిట్టం చేసేందుకు అమెరికాతో జరుగుతున్న ఈ రక్షణ ఒప్పందం భారత్ సైనిక రంగానికి సాంకేతికంగా పెద్ద ఊతాన్ని ఇవ్వనుంది.