పాకిస్థాన్‌లో ఏం జరుగుతోంది? బయటకు రాకుండా మునీర్‌ ‘ప్లాన్‌’!

  • పాకిస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు తీవ్రం
  • మీడియాపై అసిమ్‌ మునీర్‌ గట్టి పట్టు
  • నిరసనలను జాతీయ భద్రత అంశాలుగా చూపిస్తున్న మీడియా
  • పౌరుల మరణాలను ఉగ్రవాదుల హతంగా చూపిస్తున్నారని ఆరోపణ
  • పీవోకేలో రెండు నెలలుగా ఆందోళనలు
పాకిస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో పరిస్థితులు రోజురోజుకూ ఉద్రిక్తంగా మారుతున్నాయి. బలూచిస్థాన్‌, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే), గిల్గిత్‌-బాల్టిస్థాన్‌, ఖైబర్‌ పఖ్తూన్‌ఖ్వా (కేపీ)లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. మానవ హక్కుల ఉల్లంఘనలు, పౌరుల మరణాలు, బలవంతపు అదృశ్యాలు పెరుగుతున్నా.. ఈ అంశాలు పెద్దగా బయటకు రావడం లేదని అధికారులు చెబుతున్నారు.

పాకిస్థాన్‌ వాస్తవ పాలకుడిగా వ్యవహరిస్తున్న ఫీల్డ్‌ మార్షల్‌ అసిమ్‌ మునీర్‌ మీడియాపై గట్టి పట్టు సాధించారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఆయన ఆదేశాలతో దేశంలోని దాదాపు అన్ని వార్తా సంస్థలు ప్రభుత్వ అనుకూల వైఖరి అవలంబిస్తున్నాయని తెలిపాయి.

సైన్యం పీఆర్‌ విభాగం మీడియా సంస్థలతో తరచూ సంప్రదింపులు జరుపుతూ వార్తల ప్రచురణపై మార్గదర్శకాలు ఇస్తోందని ఓ అధికారి చెప్పాడు. బలూచిస్థాన్‌, పీవోకే, కేపీలోని సమస్యలను ప్రజల సమస్యలుగా చూపకుండా జాతీయ భద్రత అంశాలుగా మాత్రమే ప్రస్తావించాలని సూచించినట్లు తెలిపాడు.

భద్రతా బలగాల కాల్పుల్లో పౌరులు చనిపోతే.. వారిని ‘ఉగ్రవాదులు హతం’ అంటూ వార్తలు వస్తున్నాయని ఇంటెలిజెన్స్‌ బ్యూరో అధికారి ఒకరు పేర్కొన్నారు. పీవోకేలో రెండు నెలలుగా నిరసనలు జరుగుతున్నాయి. మౌలిక వసతుల కొరతపై కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్నారు. అయితే వారిని ఉగ్రవాదులు, అల్లరి మూకలుగా చిత్రీకరిస్తున్నారని చెప్పారు.

మానవ హక్కుల సంస్థల ప్రకారం.. ఈ ప్రాంతాల్లో పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. ఆహారం, వైద్య సామగ్రి సరఫరాపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. పౌరుల మరణాలు గతంతో పోలిస్తే భారీగా పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు.

పీవోకేలో ఎన్నికల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే ప్రభుత్వ నియంత్రణలోని మీడియా వాటిని స్వేచ్ఛాయుత ఎన్నికల ప్రక్రియను అడ్డుకునే ప్రయత్నాలుగా చూపిందని అధికారులు తెలిపారు. నిరసనకారులతో ప్రభుత్వం జరిపిన చర్చలు కూడా ఫలించలేదని పేర్కొన్నారు.
Advertisement

More Telugu News