కొండెక్కిన చక్కెర ధరలు.. మరి దేశంలో సరిపడా నిల్వలున్నాయా? కేంద్రం క్లారిటీ

Central Government clarifies on sugar stocks as prices soar in India
  • దేశంలో చక్కెర కొరత లేదన్న కేంద్రం
  • అక్టోబర్‌లో కొత్త క్రషింగ్‌ సీజన్‌ వరకు సరిపడా నిల్వలు
  • ఇథనాల్‌ కోసం చక్కెర మళ్లింపు 12 నుంచి 9 శాతానికి తగ్గిందని వెల్లడి
  • తాత్కాలిక మార్కెట్‌ కారణాలతోనే చక్కెర ధరల పెరుగుదల అని వివరణ
  • తగ్గిన ఉత్పత్తి, పండుగల డిమాండ్‌, అధిక వర్షాలతో ధరలు పెరిగాయని వెల్లడి
దేశంలో చక్కెర కొరత లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అక్టోబర్‌లో కొత్త క్రషింగ్‌ సీజన్‌ ప్రారంభమయ్యే వరకు దేశీయ డిమాండ్‌ను తీర్చేందుకు తగినంత చక్కెర నిల్వలు ఉన్నాయని వెల్లడించింది. ఇథనాల్‌ ఉత్పత్తికి చక్కెర మళ్లింపు తగ్గిందని, ప్రస్తుత ధరల పెరుగుదలకు ఇథనాల్‌ కార్యక్రమం కారణం కాదని పేర్కొంది.

2022-23లో ఇథనాల్‌ ఉత్పత్తికి మళ్లించిన చక్కెర వాటా సుమారు 12 శాతం ఉండగా.. 2025-26లో అది 9 శాతానికి తగ్గిందని ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం దేశంలో ఉత్పత్తి అవుతున్న ఇథనాల్‌లో దాదాపు మూడొంతుల వాటా ధాన్యాలు, ముఖ్యంగా మొక్కజొన్న నుంచే వస్తోందని వివరించింది.

ఇదిలా ఉండగా.. ఇటీవల చక్కెర ధరలు గణనీయంగా పెరిగాయి. జులై 20న కిలో రూ.48.18గా ఉన్న చక్కెర ధర ఆగస్టు 20 నాటికి రూ.55.70కు చేరింది. అంటే నెల రోజుల్లో సుమారు 15.6 శాతం పెరిగింది. అయితే 2024 ఆగస్టు నుంచి 2026 జులై వరకు వినియోగదారుల రిటైల్‌ చక్కెర ధరలు ఏటా సగటున కేవలం 3 శాతం మేర మాత్రమే పెరిగాయని ప్రభుత్వం తెలిపింది.

ప్రస్తుత ధరల పెరుగుదలకు దేశీయ ఉత్పత్తి అంచనాల కంటే తగ్గడం, పండుగల సీజన్‌కు ముందు డిమాండ్‌ పెరగడం, అధిక వర్షాలతో చెరకు పంట దెబ్బతినడం వంటి కారణాలు ఉన్నాయని వివరించింది. చెరకు పంటలో రెడ్‌ రాట్‌, టాప్‌ బోరర్‌ వంటి తెగుళ్లతో పాటు నీటిముంపు కారణంగా ఉత్పత్తిపై ప్రభావం పడిందని పేర్కొంది. అంతర్జాతీయంగా చక్కెర సరఫరాలు తగ్గడం, ధరలు పెరగడం, కొందరు వ్యాపారులు నిల్వలు చేయడం, మార్కెట్‌లో ఊహాగానాలు కూడా ధరల పెరుగుదలకు కారణమని తెలిపింది.

ప్రస్తుత సీజన్‌లో చక్కెర ఉత్పత్తి తొలుత అంచనా వేసిన 343 లక్షల టన్నులతో పోలిస్తే 306 లక్షల టన్నులకు పరిమితం కావచ్చని ప్రభుత్వం వెల్లడించింది. అయినప్పటికీ దేశీయ వినియోగానికి అవసరమైన నిల్వలు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేసింది. భారత్‌లో సాధారణంగా ఏటా 300-340 లక్షల టన్నుల చక్కెర ఉత్పత్తి కాగా, దేశీయ వినియోగం 280-290 లక్షల టన్నులుగా ఉంటుందని తెలిపింది.

ప్రపంచవ్యాప్తంగా కూడా చక్కెర సరఫరా ఒత్తిడిలో ఉందని ప్రభుత్వం పేర్కొంది. 2026-27లో ప్రపంచ చక్కెర లోటు సుమారు 33 లక్షల టన్నులుగా ఉండొచ్చని అంచనా వేసింది. జూన్‌ 30న టన్నుకు 474 డాలర్లుగా ఉన్న అంతర్జాతీయ చక్కెర ధర ఆగస్టు 20 నాటికి 552 డాలర్లకు పెరిగిందని తెలిపింది.

ఇథనాల్‌ కార్యక్రమం చెరకు రైతులకు, చక్కెర మిల్లులకు ప్రయోజనం చేకూర్చిందని కేంద్రం పేర్కొంది. మిగులు చక్కెరను ఇథనాల్‌ ఉత్పత్తికి మళ్లించడం ద్వారా చక్కెర మిల్లుల వద్ద నిధులు నిలిచిపోకుండా, రైతులకు చెల్లింపులు ఆలస్యం కాకుండా చూడగలిగామని వివరించింది. చెరకు సాగు విస్తీర్ణం 2015-16లో 49.27 లక్షల హెక్టార్ల నుంచి 2025-26లో 58.87 లక్షల హెక్టార్లకు పెరిగిందని తెలిపింది.

2025-26 చక్కెర సీజన్‌కు సంబంధించి రైతులకు చెల్లించాల్సిన చెరకు బకాయిల్లో ఇప్పటికే 97 శాతం చెల్లింపులు పూర్తయ్యాయని ప్రభుత్వం వెల్లడించింది. చక్కెర మిల్లుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో అవి ప్రభుత్వ సాయంపై ఆధారపడటం కూడా తగ్గిందని పేర్కొంది.
Advertisement
Central Government
Sugar prices India
Sugar stocks India
Ethanol production
Sugar production estimates
Sugar price hike

More Telugu News