ధర్మపురి అర్వింద్ అతితెలివిని ప్రదర్శిస్తూ మాట్లాడుతున్నారు: ఆది శ్రీనివాస్
- దేశ వ్యతిరేక శక్తులను కలవడానికే రేవంత్ విదేశీ పర్యటనలకు వెళ్లారన్న అర్వింద్
- కేంద్ర ప్రభుత్వ అనుమతితోనే విదేశీ పర్యటనలకు వెళ్లారన్న శ్రీనివాస్
- తెలంగాణలో బీజేపీ ఆటలు సాగవని వ్యాఖ్య
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలపై విమర్శలు చేస్తున్నారంటూ నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వ అధికారిక అనుమతులతోనే ముఖ్యమంత్రి పర్యటనకు వెళ్లారని, దాన్ని కూడా రాజకీయం చేయడం బీజేపీ నేతల దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు.
ఏదో రకంగా తెలంగాణలో అధికారంలోకి వస్తామన్న అర్వింద్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ... అక్రమ మార్గాల్లో అధికారంలోకి రావడం వారికి అలవాటేనని ఆయన ఒప్పుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణలో బీజేపీ ఆటలు సాగవని, ప్రభుత్వం జోలికి వస్తే తోకలు కత్తిరించి తాట తీస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీఆర్ఎస్, బీజేపీలు కుట్రలు చేస్తున్నాయని ఆరోపిస్తూ, "ఏ విధంగానైనా అధికారంలోకి వస్తాం" అన్న అర్వింద్ వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు.