రవితేజ సినిమా అంటే కొన్ని లెక్కలు ఉంటాయి. లవ్ .. రొమాన్స్ .. యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీకి మాస్ టచ్ ఇస్తూ ఆయన సినిమాలు నడుస్తుంటాయి. తెరపై ఆయన పాత్ర జోరుగా.. హుషారుగా .. సరదాగా .. సందడీగా సాగిపోతూ ఉంటుంది. అయితే అందుకు భిన్నంగా ఈ సారి ఆయన సినిమాకి డివోషనల్ టచ్ ఇస్తూ, శివ నిర్వాణ ఓ కథను రెడీ చేసుకున్నాడు. ఆ సినిమానే 'ఇరుముడి'. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమా, ఈ రోజునే థియేటర్లకు వచ్చింది. వరుస ఫ్లాపులతో ఉన్న రవితేజకు ఈ సినిమా హిట్ ఇస్తుందా లేదా? అనేది ఇప్పుడు చూద్దాం.
త్రినాథ్ (రవితేజ) ఆయన భార్య కావేరి (ప్రియా భవాని శంకర్) 'పొల్లూరు' అనే విలేజ్ లో నివసిస్తూ ఉంటారు. వారి ఏకైక సంతానమే మణెమ్మ (బేబీ నక్షత్ర). త్రినాథ్ కి రెండు ఎకరాల అరటితోట ఉంటుంది. దానిపై వచ్చిన ఆదాయంతోనే అతను తన కుటుంబాన్ని నెట్టుకొస్తుంటాడు. త్రినాథ్ కి 'గురుస్వామి' (సాయికుమార్) అంటే చాలా ఇష్టం. ఎందుకంటే త్రినాథ్ ను అయ్యప్ప దిశగా నడిపించింది ఆయనే. అయ్యప్ప దయ వల్లనే తనకి కూతురు పుట్టిందని భావించిన త్రినాథ్, ప్రతి ఏడాది దీక్ష తీసుకుని శబరిమల వెళ్లి వస్తుంటాడు.
కూతురు మణి అంటే త్రినాథ్ కి ప్రాణం. అందువల్లనే ఆ పాపకి ఇచ్చిన మాట కోసం మందు మానేస్తాడు. ఏ రోజుకు ఆ రోజు ఏం జరిగిందని అతను కూతురును కనుక్కోవడం .. ఏ మాత్రం దాచకుండా తండ్రికి చెప్పడం ఆ పాపకి అలవాటు. ఈ కారణంగానే ఏం జరిగినా తన వెనుక తన తండ్రి ఉన్నాడనే ఒక నమ్మకం ఆ పాపకి కలుగుతుంది. ఇలాంటి పరిస్థితులలోనే పిల్లల పట్ల చాలా కఠినంగా వ్యవహరించే ధనలక్ష్మి (శ్వాసిక ) ఆ పాప చదువుకునే గవర్నమెంట్ స్కూల్ కి టీచర్ గా వస్తుంది. గురుస్వామి కూతురు గాయత్రితో కలిసి స్కూల్ కి వెళ్లి వస్తుంటుంది.
ఇంకా ఊళ్లో ఎర్రాజీ (అజయ్ ఘోష్) కొడుకు నాగులు రౌడీయిజం చేస్తుంటాడు. అదే సమయంలో ఈ పిల్లలు స్కూల్ కి వెళ్లి వచ్చే దారిలో 'డొంకరాయి' అనే విలేజ్ ఉంటుంది. అక్కడ ఒక నలుగురు పోకిరీలు మకాం పెడతారు. ఆడపిల్లలను వేధిస్తూ ఉంటారు. అమ్మాయిలందరినీ తన కూతుళ్లుగా భావించే త్రినాథ్, స్కూల్ టీచర్ మొదలు, దారికాసే పోకిరీల నుంచి .. పెద్ద మనుషుల ముసుగులో ఉండే తోడేళ్ల నుంచి వాళ్లను ఎలా కాపాడుకుంటాడు? అందుకోసం ఏం చేస్తాడు? అనేదే మిగతా కథ.
ప్రతి తండ్రికి తన కూతురే ప్రపంచం. కూతురు తరువాతనే ఎవరైనా .. ఆ మాటకొస్తే తానైనా. కూతురు కోసమే బ్రతికే తండ్రులు ఎంతోమంది ఉన్నారు. వాళ్లంతా కూడా 'ఏం కావాలమ్మా?' అనే మాట ప్రతిసారి అడుగుతూనే ఉంటారు. కానీ ఈ రోజున ఏం జరిగిందమ్మా .. ఎవరైనా భయపెట్టారా .. బెదిరించారా? అలాంటి సంఘటనలు ఏమైనా చూశావా? అని మాత్రం అడగరు. అలా అడగడం అలవాటైతే .. చెప్పడం ఆ కూతురుకు అలవాటు చేస్తే ఎలా ఉంటుందనేదే ఈ సినిమా కథ.
కూతురే లోకంగా .. కుటుంబమే సర్వంగా బ్రతికే ఒక తండ్రి కథ ఇది. ఊళ్లో ఉన్న ఆడపిల్లలంతా తన కూతులాంటివారేనని భావించే ఆ తండ్రి, శత్రువులు తన కూతురును టచ్ చేయడానికి ప్రయత్నిస్తే ఏం చేస్తాడు? అనే ప్రధానమైన అంశం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఊరు మనుషులలో మంచితనమూ ఎక్కువే .. అమాయకత్వము ఎక్కువే. ఆడపిల్ల ఉంటే భయానికి మరింత దగ్గరగా బ్రతుకుతారని భావించిన మృగాలపై ఒక ఆడపిల్ల తండ్రి చేసిన పోరాటమే ఈ సినిమా.
ఈ సినిమా మొత్తంలో చెప్పుకోదగిన సీన్ ఒకటి ఉంది. తాను అయ్యప్ప మాల వేసుకుంటే, తన శత్రువులు తనపై దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలుసుకున్న త్రినాథ్, తన ఊరు సెంటర్ కి వచ్చి తనతో తలపడాలనీ .. లేదంటే శరణాలు చెప్పి వెళ్లిపొమ్మని చాటింపు వేయించడం కొత్తగా అనిపిస్తుంది. ఇక రవితేజ ట్రాలీ ఆటోను రౌడీమూకలు ఛేజ్ చేయడం ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది.
ప్రతిసారి త్రినాథ్ 'స్వామి శరణం' అంటూ బరిలోకి దిగిపోవడం ఆడియన్స్ ను ఉత్సాహపరుస్తుంది. తన ఊరు ఆడపిల్లలు సేఫ్ గా ఉండాలంటే 'నాగులు' బ్రతక్కూడదని భావించిన త్రినాథ్ అతనిని చంపడానికి వెళతాడు. అయితే అతను ఒక ముసుగు వ్యక్తి చేత దారుణంగా చంపబడతాడు. ఆ వ్యక్తి ఎవరు? నాగులను చంపవలసిన అవసరం ఇంకా ఎవరికి ఉంది? అనే ఒక సందేహంతో ప్రేక్షకులు ఉండగానే ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుంది. ఇక సెకండాఫ్ అంతా బలమైన ట్విస్ట్ లను పరిచయం చేస్తూ పరిగెడుతుంది. యాక్షన్ .. ఎమోషన్ తో కూడిన క్లైమాక్స్ కన్నీళ్లు పెట్టిస్తుంది. చివర్లో వచ్చే సన్నివేశాలలో తమిళ సినిమాలు ఫ్లేవర్ కనిపిస్తుంది.
తండ్రీ కూతుళ్ల మధ్య ఉన్న ఎమోషన్ ను దర్శకుడు ఆవిష్కరించిన తీరు ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది. రవితేజ .. సాయికుమార్ .. రమేశ్ ఇందిర .. శ్వాసిక పాత్రలు ఈ కథకు నాలుగు పిల్లర్లుగా చెప్పుకోవలసి ఉంటుంది. బేబీ నక్షత్ర పాత్ర .. నటన ప్రత్యేక ఆకర్షణగా ఒప్పుకోవాలి. విష్ణు శర్మ కెమెరా పనితనం బాగుంది. జీవీప్రకాశ్ కుమార్ బాణీలు హుషారెత్తిస్తాయి. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ మెప్పిస్తుంది.
ఈ సమాజంలో ఆడపిల్లలకు రక్షణ లేదు. కొన్ని మృగాలు అడవులలో .. మరికొన్ని మృగాలు వీధుల్లో .. ఇంకొన్ని ఖరీదైన కార్లలో తిరుగుతూ ఉంటాయి. ఆడపిల్లలను పెంచడమంటే వాళ్లలో భయం పెంచడం కాదు .. ధైర్యం నింపడం అనే సందేశం ఈ కథలో మనకి కనిపిస్తుంది. రవితేజ మార్క్ కి కాస్త దూరంగా నడిచిన ఈ కథ, ఒక సగటు ఆడపిల్ల తండ్రిగా మాత్రమే ఆయనను ప్రేక్షకుల ముందు నిలబెట్టింది. కొత్తదనం వైపు నుంచి మంచి మార్కులు కొట్టేసింది. రవితేజ హిట్ చిత్రాల జాబితాలో ఈ సినిమా కూడా చేరిపోతుందనే చెప్పొచ్చు.
'ఇరుముడి' -మూవీ రివ్యూ!
Irumudi Review
Movie Details
Movie Name: Irumudi
Genre: Action, Drama
Release Date: 2026-08-21
Cast: Ravi Teja,Priya Bhavani Shankar,Baby Nakshathra ,Sai Kumar,Ramesh Indira,Swasika
Director: Shiva Nirvana
PRO: -
Music: GV Prakash Kumar
Banner: Mythri Movie Makers
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer