రవితేజ ఎనర్జీని మ్యాచ్ చేయడం కష్టం: హీరోయిన్ ప్రియా

It is difficult to match Ravi Tejas energy Actress Priya
  • ఇరుముడిలో సరికొత్త రవితేజ కనిపిస్తారన్న ప్రియా భవానీ శంకర్
  • తనది మధ్యతరగతి గృహిణి పాత్ర అని, ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుందని వెల్లడి
  • తండ్రీకూతుళ్ల మధ్య ఎమోషన్ సినిమాకు హైలైట్
  • శివ నిర్వాణ దర్శకత్వంలో ఆగస్టు 21న సినిమా విడుదల
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఇరుముడి’. ఈ సినిమాలో ఆయన సరసన నటి ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రియా భవానీ శంకర్ మీడియాతో మాట్లాడుతూ సినిమా విశేషాలను పంచుకుంది.

ఈ సినిమాలో తాను కావేరి అనే సాధారణ గృహిణి పాత్రలో కనిపిస్తానని ప్రియా చెప్పింది. "తాగుబోతు భర్త, అల్లరి చేసే కూతురితో సాగే మధ్యతరగతి గృహిణి పాత్ర నాది. ఈ పాత్ర వాస్తవానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఇలాంటి పాత్ర చేయడం నాకు ఇదే తొలిసారి" అని ఆమె వివరించింది. ‘ఇరుముడి’ ఒక యాక్షన్ థ్రిల్లర్ అయినప్పటికీ బలమైన భావోద్వేగాలు ఉంటాయని, ముఖ్యంగా తండ్రీకూతుళ్ల మధ్య ఉండే ఎమోషన్ అందరినీ కదిలిస్తుందని వెల్లడించింది.

రవితేజతో పనిచేయడంపై మాట్లాడుతూ.. "రవితేజ ఎనర్జీ అసాధారణం. దాన్ని మ్యాచ్ చేయడం చాలా కష్టం. అయితే ఈ సినిమాలో మీరు మునుపెన్నడూ చూడని ఒక కొత్త రవితేజను చూస్తారు" అని ప్రియా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. దర్శకుడు శివ నిర్వాణ కథను చెప్పిన విధానం, పాత్రలను మలిచిన తీరు తనను ఎంతగానో ఆకట్టుకుందని ఆమె ప్రశంసించింది. ప్రస్తుతం తాను ‘దూత 2’ సిరీస్ షూటింగ్‌లో పాల్గొంటున్నానని, ‘డెమోంటే కాలనీ 3’ కూడా విడుదలకు సిద్ధంగా ఉందని తన భవిష్యత్ ప్రాజెక్టుల గురించి ప్రియా భవానీ శంకర్ వెల్లడించింది.
Advertisement
Ravi Teja
Tollywood
Priya Bhavani Shankar
Irumudi

More Telugu News