నీరే మాకు ఆధారం.. భారత్ ఏకపక్ష నిర్ణయాలను అడ్డుకుంటాం: హెహబాజ్ షరీఫ్
- సింధు నదీ జలాల వివాదంపై షెహబాజ్ షరీఫ్ ఘాటు వ్యాఖ్యలు
- పాకిస్థాన్‌కు వచ్చే నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటే తమ దేశం సహించదని వ్యాఖ్య
- తమ నీటి హక్కుల కోసం అన్ని వేదికలపై పోరాడుతామని హెచ్చరిక
సింధు నదీ జలాల ఒప్పందం వివాదంపై భారత్‌ను ఉద్దేశించి పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌కు నీరే ప్రధానమైన జీవనాధారమని, నదీ జలాల విషయంలో తమ దేశానికి వర్తించే హక్కులపై రాజీ పడే ప్రసక్తి లేదని ఆయన తేల్చి చెప్పారు.
ఇస్లామాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ... సింధు నదీ జలాల ఒప్పందంలో మార్పులు చేయడం కానీ, పాకిస్థాన్‌కు వచ్చే నీటి ప్రవాహాన్ని అడ్డుకోవడం లేదా డైవర్ట్ చేయడం కానీ చేస్తే దాన్ని తమ దేశం ఏమాత్రం సహించదని స్పష్టం చేశారు. తమకు ‘నీరే రెడ్ లైన్’ అని, ఈ విషయంలో భారత్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు.
పహల్‌గామ్ ఉగ్రదాడి అనంతరం భారతదేశం సింధు నదీ జలాల ఒప్పందాన్ని సవరించాలని లేదా పునఃసమీక్షించాలని కోరుతూ పాకిస్థాన్‌కు నోటీసులు పంపిన నేపథ్యంలో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. 60 ఏళ్ల నాటి ఈ ఒప్పందంలో మార్పులు తెచ్చేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలను పాకిస్థాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తమ నీటి హక్కులను కాపాడుకోవడానికి దౌత్యపరంగా, చట్టపరంగా అన్ని వేదికలపైనా పోరాడతామని షరీఫ్ పేర్కొన్నారు.