ఇజ్రాయెల్ రాజకీయాల్లో సంచలనం.. నెతన్యాహుకు గట్టి పోటీ ఇస్తున్న మాజీ ఆర్మీ చీఫ్.. ఎవరీ ఐజెన్‌కోట్

Gadi Eisenkot sensation in Israel politics former Army Chief gives tough competition to Netanyahu
  • ఇజ్రాయెల్ రాజకీయాల్లో నెతన్యాహుకు గట్టి పోటీ
  • మాజీ సైన్యాధ్యక్షుడు గాడీ ఐజెన్‌కోట్ నుంచి సవాల్
  • వార్ క్యాబినెట్ నుంచి వైదొలగి 'యాషార్' పేరుతో కొత్త అడుగులు
  • సర్వేలలో నెతన్యాహు పార్టీకి, ఐజెన్‌కోట్ పార్టీకి మధ్య స్వల్ప తేడా
  • ప్రధాని రేసులో ఐజెన్‌కోట్‌కు పెరుగుతున్న ప్రజా మద్దతు
ఇజ్రాయెల్ రాజకీయాలు అత్యంత రసవత్తరంగా మారాయి. సుదీర్ఘకాలంగా ప్రధానిగా కొనసాగుతున్న బెంజమిన్ నెతన్యాహుకు, ఆ దేశ మాజీ సైన్యాధ్యక్షుడు (ఐడీఎఫ్ చీఫ్) గాడీ ఐజెన్‌కోట్ రూపంలో ఊహించని, బలమైన సవాల్ ఎదురవుతోంది. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఐజెన్‌కోట్, నెతన్యాహుకు ప్రధాన ప్రత్యర్థిగా నిలవడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.

గాడీ ఐజెన్‌కోట్ ఇజ్రాయెల్ సైనిక, రాజకీయ వర్గాల్లో ఎంతో గౌరవం ఉన్న వ్యక్తి. 1960లో జన్మించిన ఆయన, ప్రఖ్యాత 'గొలానీ బ్రిగేడ్' ద్వారా సైన్యంలో చేరారు. అంచెలంచెలుగా ఎదిగి 2015 నుంచి 2019 వరకు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) 21వ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. మొరాకో యూదుల సంతతికి చెందిన వ్యక్తి ఈ ఉన్నత పదవిని చేపట్టడం ఇజ్రాయెల్ చరిత్రలో ఇదే తొలిసారి.

2023 గాజా యుద్ధం తర్వాత, నెతన్యాహు నేతృత్వంలోని అత్యవసర వార్ క్యాబినెట్‌లో ఐజెన్‌కోట్ పరిశీలకుల మంత్రిగా చేరారు. అయితే, ఇదే యుద్ధంలో ఆయన తన కుమారుడు గాల్ ఐజెన్‌కోట్‌ను కోల్పోయారు. ఈ విషాదం నుంచి తేరుకోకముందే, యుద్ధ లక్ష్యాల సాధనలో నెతన్యాహు విఫలమయ్యారని, బందీల విడుదలలో జాప్యం చేస్తున్నారని ఆరోపిస్తూ 2024 జూన్‌లో వార్ క్యాబినెట్ నుంచి తప్పుకున్నారు.

కొత్త రాజకీయ ప్రత్యామ్నాయం
క్యాబినెట్ నుంచి బయటకు వచ్చాక ఐజెన్‌కోట్, 'యాషార్' పేరుతో కొత్త రాజకీయ వేదికను ప్రారంభించారు. జాతీయ ఐక్యతను సాధించడమే తన లక్ష్యమని ఆయన ప్రకటించారు. అరబ్ పార్టీల మద్దతు తీసుకునే విషయంలో కూడా ఆయన సానుకూలంగా ఉండగా, నెతన్యాహు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

సర్వేలలో హోరాహోరీ
తాజా సర్వేలు ఇజ్రాయెల్ ఎన్నికల పోరు హోరాహోరీగా ఉండబోతోందని స్పష్టం చేస్తున్నాయి. ఇటీవల వెలువడిన 'కేఏఎన్ న్యూస్' సర్వే ప్రకారం.. నెతన్యాహుకు చెందిన లికుడ్ పార్టీకి 24 సీట్లు వస్తాయని అంచనా వేయగా, ఐజెన్‌కోట్ నేతృత్వంలోని యాషార్ పార్టీ 23 సీట్లతో గట్టి పోటీ ఇస్తోంది. ప్రధాని అభ్యర్థిగా నెతన్యాహుకు 41 శాతం మంది మద్దతిస్తుండగా, ఐజెన్‌కోట్‌కు 34 శాతం మంది మద్దతుగా నిలుస్తున్నారు. మాజీ సైన్యాధ్యక్షుడిగా క్లీన్ ఇమేజ్, వ్యక్తిగత త్యాగం వంటి అంశాలు ఐజెన్‌కోట్‌కు బలంగా మారగా, రాజకీయ ఉద్దండుడైన నెతన్యాహుకు ఈసారి గట్టి పోటీ తప్పేలా లేదు.
Advertisement
Gadi Eisenkot
Benjamin Netanyahu
Israel Politics
IDF Chief
Yashar Party
Israel Elections

More Telugu News