ఇరాన్ యుద్ధంలో అమెరికాకు కోలుకోలేని దెబ్బ: 45 'రీపర్' డ్రోన్ల ధ్వంసం.. రూ. 11 వేల కోట్లకు పైగా నష్టం!

United States suffers heavy blow in Iran conflict as 45 Reaper drones destroyed
  • అమెరికాకు 1.3 బిలియన్ డాలర్లకు పైగా ఆస్తి నష్టం అంచనా
  • నెమ్మదిగా ప్రయాణించడం, సిగ్నల్ సమస్యలే రీపర్ ద్రోన్ల వైఫల్యానికి కారణం
  • ఇవే డ్రోన్ల కొనుగోలుకు భారత్ ఒప్పందం చేసుకోవడంపై చర్చ
ఇరాన్‌తో కొనసాగుతున్న తీవ్ర సైనిక ఘర్షణలో అగ్రరాజ్యం అమెరికాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా సైనిక పాటవానికి ప్రతీకగా నిలిచే అత్యంత శక్తిమంతమైన ఎంక్యూ-9 రీపర్ డ్రోన్లలో ఏకంగా 45 డ్రోన్లు ధ్వంసమైనట్లు ప్రముఖ పత్రిక 'వాషింగ్టన్ పోస్ట్' తన కథనంలో వెల్లడించింది. ఇది అమెరికా వద్ద ఉన్న మొత్తం రీపర్ డ్రోన్ల వ్యూహాత్మక బలగంలో పావు వంతు (25 శాతం) కావడంతో పెంటగాన్ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.

ధ్వంసమైన 45 డ్రోన్ల విలువ సుమారు 1.3 బిలియన్ డాలర్లకు పైనే ఉంటుందని అంచనా. అంటే భారత కరెన్సీలో ఇది దాదాపు రూ.11,000 కోట్లకు పైమాటే. ఒక్కో రీపర్ డ్రోన్ ధర, దానిపై అమర్చిన సెన్సార్లు, ఆయుధాలను బట్టి 30 నుంచి 50 మిలియన్ డాలర్ల వరకు ఉంటుంది. ఈ భారీ నష్టం అమెరికా పన్ను చెల్లింపుదారులపై పెను భారం మోపుతోంది.

డ్రోన్లు ఎందుకు విఫలమవుతున్నాయి?
అగ్రరాజ్యం గర్వంగా చెప్పుకునే ఈ డ్రోన్లు ఇరాన్ ముందు ఎందుకు విఫలమవుతున్నాయనే దానిపై అధికారులు పలు కారణాలను విశ్లేషిస్తున్నారు. ప్రధానంగా, ఈ డ్రోన్లు చాలా నెమ్మదిగా, తక్కువ ఎత్తులో ప్రయాణించడం వల్ల ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ క్షిపణులకు ఇవి సులభమైన లక్ష్యాలుగా మారుతున్నాయి. కేవలం క్షిపణి దాడులే కాకుండా, సాంకేతిక లోపాలు, కమ్యూనికేషన్ సిగ్నల్స్ కట్ అవ్వడం వల్ల కూడా కొన్ని డ్రోన్లు కూలిపోయినట్లు ఓ అధికారి తెలిపారు. అంతేకాకుండా, మధ్యప్రాచ్యంలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ జరిపిన దాడుల్లో నేలపై ఉన్న కొన్ని డ్రోన్లు కూడా నాశనమయ్యాయి.

తీవ్ర ఆందోళనలో పెంటగాన్
ఈ నష్టంతో అమెరికా డ్రోన్ల నిల్వ గణనీయంగా పడిపోయింది. యుద్ధానికి ముందు అమెరికా వైమానిక దళం, మెరైన్ కోర్ప్స్ వద్ద కలిపి మొత్తం 185 రీపర్ డ్రోన్లు ఉండగా, ఇప్పుడు వాటి సంఖ్య 135కు పడిపోయిందని ఎయిర్‌ఫోర్స్ లెఫ్టినెంట్ జనరల్ డేవిడ్ టాబోర్ ఇటీవల సెనెట్‌లో అంగీకరించారు. ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలకు కనీసం 189 డ్రోన్లు అవసరమని, ఈ నష్టం తమను ఆందోళనకు గురిచేస్తోందని ఆయన తెలిపారు. ఈ డ్రోన్లను తయారుచేసే జనరల్ ఆటోమిక్స్ సంస్థ 2025లోనే ఉత్పత్తిని నిలిపివేయడంతో, కోల్పోయిన డ్రోన్లను భర్తీ చేయడం అమెరికాకు పెను సవాలుగా మారింది.

ఇదిలా ఉండగా, అమెరికా కోల్పోతున్న ఈ ఎంక్యూ-9 రీపర్ డ్రోన్లనే భారత్ కూడా కొనుగోలు చేస్తోంది. త్రివిధ దళాల కోసం 31 డ్రోన్లను కొనుగోలు చేసేందుకు భారత్ 2024లో ఒప్పందం చేసుకుంది. ఈ డ్రోన్ల డెలివరీలు 2029 నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే, ఇరాన్ యుద్ధక్షేత్రంలో రీపర్ డ్రోన్ల పనితీరుపై వెలువడుతున్న నివేదికలు ఇప్పుడు అంతర్జాతీయ రక్షణ రంగ నిపుణుల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
Advertisement
MQ-9 Reaper
United States
Iran
Pentagon
Washington Post
US Iran Conflict

More Telugu News