ఏపీ అగ్నిమాపక శాఖకు కొత్త బలం.. రానున్న 58 ఆధునిక వాహనాలు

AP Fire Department gets new strength with 58 modern vehicles
  • ఏపీ ఫైర్ డిపార్ట్‌మెంట్‌కు రూ.40 కోట్లతో కొత్త వాహనాలు
  • మొత్తం 58 ఆధునిక ఫైర్ ఇంజన్లను ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు 
  • ఇరుకైన వీధుల కోసం ప్రత్యేకంగా క్విక్ రెస్పాన్స్ వాహనాలు
  • గ్రామీణ, అటవీ ప్రాంతాల్లో సేవలకు అధునాతన ఫైటర్లు
  • ఇప్పటికే తొలి దశలో 65 వాహనాలను సమకూర్చిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అగ్నిమాపక సేవలను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రూ.40 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసిన 58 ఆధునిక అగ్నిమాపక వాహనాలను సీఎం చంద్రబాబు నాయుడు త్వరలో ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో అగ్ని ప్రమాదాల నివారణ, సహాయక చర్యలను మరింత వేగవంతం చేయడమే లక్ష్యంగా ఈ వాహనాలను సమకూర్చారు.

ఈ కొత్త వాహనాల్లో వేర్వేరు అవసరాలకు తగినట్లుగా మూడు రకాలు ఉన్నాయి. గ్రామీణ, అటవీ ప్రాంతాల్లోని అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు 25 అధునాతన ఫైర్‌ఫైటింగ్ వాహనాలను సిద్ధం చేశారు. భారీ అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు నిరంతరాయంగా నీటి సరఫరా చేసేందుకు 20 వాటర్ బౌజర్లను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఇక పట్టణాల్లోని ఇరుకైన వీధులు, రద్దీ ప్రదేశాలకు వేగంగా చేరుకుని సహాయక చర్యలు చేపట్టేందుకు 13 క్విక్ రెస్పాన్స్ మల్టీపర్పస్ ఫైర్‌ఫైటింగ్ వాహనాలను ప్రత్యేకంగా రూపొందించారు.

ప్రభుత్వం ఇప్పటికే తొలి దశలో రూ.33 కోట్ల వ్యయంతో 65 ఫైర్‌ఫైటింగ్ వాహనాలను కొనుగోలు చేసి అగ్నిమాపక శాఖకు అప్పగించింది. తాజా కొనుగోళ్లతో శాఖ సామర్థ్యం మరింత పెరగనుంది. ఈ ఆధునిక వాహనాల ద్వారా రాష్ట్రంలో ఎక్కడైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా అగ్ని ప్రమాదాలకు వేగంగా స్పందించి నష్టాన్ని తగ్గించేందుకు వీలు కలుగుతుందని అధికారులు భావిస్తున్నారు.
Advertisement
AP Fire Department
Chandrababu Naidu
Andhra Pradesh Government
Firefighting Vehicles
AP Fire Services
Disaster Management

More Telugu News