ఐఐటీలో ఏడాది ఏఐ కోర్సు.. ఉచిత హాస్టల్‌, భోజనంతో పాటు స్టైపెండ్‌!

IIT Dharwad offers one year AI course with free hostel food and stipend
  • ఐఐటీ ధార్వాడ్‌లో ఏడాది ఏఐ కోర్సు ఉచితం
  • నెలకు రూ.1,000 స్టైపెండ్‌ 
  • ఆగస్టు 31 వరకు దరఖాస్తుకు అవకాశం
  • 18-45 ఏళ్ల మైనారిటీ గ్రాడ్యుయేట్లు అర్హులు
  • మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించారు 
కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో కెరీర్‌ మొదలుపెట్టాలనుకునే వారికి అదిరిపోయే అవకాశం. ప్రతిష్ఠాత్మక ఐఐటీలో ఏడాది పాటు ఉచితంగా ఏఐ శిక్షణ పొందొచ్చు. హాస్టల్‌, భోజనం, వసతి సౌకర్యాలతో పాటు నెలకు రూ.1,000 స్టైపెండ్‌ కూడా అందుతుంది. ఈ అవకాశాన్ని ఐఐటీ ధార్వాడ్‌ అందిస్తోంది.

కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వశాఖకు చెందిన పీఎం వికాస్‌ పథకం 2026-27లో భాగంగా ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ‘ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ టెక్నోక్రాట్‌’ పేరుతో ఏడాది పాటు రెసిడెన్షియల్‌ కోర్సు ఉంటుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆగస్టు 31లోగా దరఖాస్తు చేసుకోవాలి.

ఎవరికి అవకాశం?
మైనారిటీ వర్గాలకు చెందిన 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయసున్న గ్రాడ్యుయేట్లు దరఖాస్తు చేసుకోవచ్చు. ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, పార్సీలు, జైనులు అర్హులు. ఏఐ అప్లికేషన్లపై ప్రాథమిక పరిజ్ఞానం ఉన్న గ్రాడ్యుయేట్లతో పాటు ఐటీఐ అభ్యర్థులు, చివరి సంవత్సరం డిగ్రీ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఏం ప్రయోజనాలు?
ఎంపికైన వారికి ఐఐటీ ధార్వాడ్‌లో ఉచిత శిక్షణ ఇస్తారు. అవసరమైన వారికి హాస్టల్‌ సౌకర్యం కల్పిస్తారు. బోర్డింగ్‌, లాడ్జింగ్‌ కూడా కార్యక్రమంలో భాగంగా ఉంటుంది. సెక్టార్‌ స్కిల్‌ కౌన్సిల్‌ గుర్తింపు పొందిన సర్టిఫికెట్‌ అందిస్తారు. కేంద్రం నుంచి నేరుగా డీబీటీ ద్వారా నెలకు రూ.1,000 స్టైపెండ్‌ వస్తుంది.

కోర్సు పూర్తయ్యాక ఉద్యోగంలో చేరిన వారికి రెండు నెలల పోస్ట్‌-ప్లేస్‌మెంట్‌ సపోర్ట్‌ ఉంటుంది. ఉద్యోగం పొందిన అభ్యర్థులకు రూ.4,000 ఆర్థిక సాయం కూడా అందిస్తారు.

దరఖాస్తుకు కావాల్సినవి..
ఆధార్‌, పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటో, పదో తరగతి సర్టిఫికెట్‌, డిగ్రీ సర్టిఫికెట్‌, బ్యాంక్‌ పాస్‌బుక్‌, మైనారిటీ సర్టిఫికెట్‌ సమర్పించాలి. వర్తించే వారికి ఈడబ్ల్యూఎస్‌ సర్టిఫికెట్‌ అవసరం. మొత్తం సీట్లలో 33 శాతం మహిళలకు కేటాయించారు. మైనారిటీ వర్గాలకు చెందని ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు 15 శాతం వరకు సీట్లు కేటాయించారు. అభ్యర్థులను స్క్రీనింగ్‌ ద్వారా ఎంపిక చేస్తారు.
Advertisement
IIT Dharwad
Free AI Course
PM Vikas Scheme
Artificial Intelligence Technocrat
Ministry of Minority Affairs
AI Training with Stipend

More Telugu News