నల్సార్ విద్యార్థులపై వేటు: మీరెవరు జోక్యం కావడానికి?.. బీసీఐపై సీజేఐ ఆగ్రహం

CJI Surya Kant Slams BCI Over Action Against NALSAR Students
  • నల్సార్ గ్రాడ్యుయేట్ల నమోదును నిలిపివేస్తూ బీసీఐ ఉత్తర్వులు
  • బీసీఐ నిర్ణయంపై తీవ్రంగా స్పందించిన సీజేఐ సూర్యకాంత్‌
  • తాను కూడా విద్యార్థిగా నిరసనల్లో పాల్గొన్నానని చెప్పిన సీజేఐ
  • తీవ్ర విమర్శలు, సీజేఐ జోక్యంతో ఉత్తర్వులను వెనక్కి తీసుకున్న బీసీఐ
  • బీసీఐ చర్య చట్టవిరుద్ధమన్న సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్
హైదరాబాద్‌లోని నల్సార్ లా యూనివర్సిటీ విద్యార్థుల విషయంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) తీసుకున్న వివాదాస్పద నిర్ణయంపై భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్‌ తీవ్రంగా స్పందించారు. ఈ విషయంలో మీరు జోక్యం చేసుకోవద్దని బీసీఐని ఆయన గట్టిగా హెచ్చరించారు. సీజేఐ జోక్యంతో పాటు ఇతర వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో బీసీఐ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.

నల్సార్ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి సీజేఐ హాజరుకావడాన్ని వ్యతిరేకిస్తూ కొందరు విద్యార్థులు ప్రచారం చేపట్టారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన బీసీఐ, విచారణ పూర్తయ్యే వరకు 2026 బ్యాచ్‌కు చెందిన నల్సార్ గ్రాడ్యుయేట్లను న్యాయవాదులుగా నమోదు చేయవద్దని దేశంలోని అన్ని రాష్ట్రాల బార్ కౌన్సిళ్లకు నిన్న‌ ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రచారానికి ఎవరు సూత్రధారులో తేల్చేందుకు నివేదిక ఇవ్వాలని యూనివర్సిటీ వైస్-ఛాన్సలర్‌ను కోరింది.

బీసీఐ చర్యపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "ఇది అస్సలు ఆమోదయోగ్యం కాదు. నేను కూడా విద్యార్థిగా ఉన్నప్పుడు నిరసనల్లో చురుగ్గా పాల్గొన్నాను. ఇది నాకు, విద్యార్థులకు మధ్య జరగాల్సిన సంభాషణ. ఇందులో జోక్యం చేసుకోవడానికి వాళ్లెవరు?" అని ఆయన ఘాటుగా ప్రశ్నించారు. ఈ వివాదంపై వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు బీసీఐని ఆదేశించింది. నల్సార్ విద్యార్థులు లేదా అధ్యాపకులపై ఎలాంటి శిక్షాత్మక చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది.

అంతకుముందు బీసీఐ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (ఎస్‌సీబీఏ) అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ తీవ్రంగా ఖండించారు. ఇది ఏకపక్షం, చట్టవిరుద్ధమని పేర్కొంటూ బీసీఐ ఛైర్మన్ మనన్ కుమార్ మిశ్రాకు లేఖ రాశారు. భావప్రకటనా స్వేచ్ఛను వినియోగించుకున్నందుకు న్యాయ విద్యార్థులను భయపెట్టడమేనని, రాజ్యాంగబద్ధమైన అధికారితో విభేదించినంత మాత్రాన వారిని వృత్తిలోకి రాకుండా అడ్డుకోలేరని స్పష్టం చేశారు.

నలువైపుల నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో బీసీఐ కొన్ని గంటల్లోనే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. 2026 నల్సార్ గ్రాడ్యుయేట్లలో చాలామంది నిర్దోషులని, సీజేఐని అగౌరవపరిచే చర్యల్లో పాల్గొనే ఉద్దేశం వారికి లేదని తమకు తాజా సమాచారం అందిందని ఒక ప్రకటనలో వివరణ ఇచ్చింది. దీంతో ఈ వివాదం ప్రస్తుతానికి సద్దుమణిగింది.
Advertisement
CJI Surya Kant
NALSAR University
Bar Council of India
BCI vs NALSAR students
Student protest rights
Supreme Court of India

More Telugu News