టాటా సన్స్‌ ఛైర్మన్‌ పదవికి గుడ్‌బై.. చంద్రశేఖరన్‌ సంపాదన ఎంతో తెలుసా?

N Chandrasekaran to step down as Tata Sons Chairman and his total earnings details
  • 2027 ఫిబ్రవరి తర్వాత కొనసాగడానికి చంద్రశేఖరన్‌ నిరాకరణ
  • 2025-26లో చంద్రశేఖరన్‌కు రూ.158.6 కోట్ల పారితోషికం
  • ఇందులో రూ.140.7 కోట్లు కమీషన్‌
  • ఐదేళ్లలో ఆయన మొత్తం సంపాదన రూ.685 కోట్లని అంచనా
టాటా సన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ ఎన్‌. చంద్రశేఖరన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. సంస్థ వార్షిక సర్వసభ్య సమావేశానికి ముందు ఇవాళ ఛైర్మన్‌ పదవి నుంచి వైదొలిగారు. ప్రస్తుత పదవీకాలం 2027 ఫిబ్రవరితో ముగియనుంది. ఆ తర్వాత మరోసారి బాధ్యతలు చేపట్టేందుకు ఆయన ఆసక్తి చూపలేదు. అయితే, ఛైర్మన్‌గా ఆయన సంపాదన ఎంత ఉండొచ్చని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఆ వివరాలు చూద్దాం..

చంద్రశేఖరన్‌కు 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.158.6 కోట్ల పారితోషికం లభించింది. టాటా సన్స్‌ తన డైరెక్టర్ల వేతన వివరాలను వెల్లడించడం ప్రారంభించిన తర్వాత ఇదే ఆయనకు అత్యధిక వార్షిక పారితోషికం. ఇందులో జీతం, అలవెన్సుల రూపంలో రూ.17.9 కోట్లు వచ్చాయి. మిగిలిన రూ.140.7 కోట్లు కమీషన్‌ రూపంలో అందాయి.

దీంతో గత ఐదేళ్లలో చంద్రశేఖరన్‌ టాటా సన్స్‌ నుంచి అందుకున్న మొత్తం పారితోషికం దాదాపు రూ.685 కోట్లని అంచనా. 2024-25లో ఆయనకు రూ.155 కోట్లు అందగా.. 2023-24లో రూ.134.8 కోట్లు లభించాయి. గత ఐదేళ్లలో 2025-26లోనే అత్యధిక మొత్తం అందుకున్నారు.

టాటా సన్స్‌ డైరెక్టర్లకు ఆ ఏడాది చెల్లించిన మొత్తం పారితోషికంలో చంద్రశేఖరన్‌ వాటా దాదాపు 80 శాతంగా ఉంది. అయినప్పటికీ దేశంలో అత్యధిక పారితోషికం అందుకునే కార్పొరేట్‌ అధిపతుల్లో ఆయన రెండో స్థానంలో నిలిచారు. హెచ్‌సీఎల్‌టెక్‌ సీఈఓ సి.విజయకుమార్‌కు లభించిన రూ.176 కోట్లతో పోలిస్తే చంద్రశేఖరన్‌ పారితోషికం తక్కువ.

టాటా సన్స్‌ సీఎఫ్‌ఓ, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సౌరభ్‌ అగర్వాల్‌ రూ.34 కోట్లతో సంస్థలో రెండో అత్యధిక పారితోషికం అందుకున్న అధికారి. ఇందులో రూ.26 కోట్లు కమీషన్‌. మిగతా ఏడుగురు డైరెక్టర్లలో ఎవరూ పూర్తి పారితోషికం అందుకోలేదు. అయితే ఆరుగురు బోర్డు సభ్యులకు రూ.1 కోటి నుంచి రూ.3 కోట్ల వరకు కమీషన్‌ చెల్లించారు.
Advertisement
N Chandrasekaran
Tata Sons
Tata Sons Chairman Salary
N Chandrasekaran Resignation
Highest Paid CEOs India
Tata Group News

More Telugu News