కుంకుమపువ్వు మాత్రమే కాదు.. భారత్‌లో పండే ఈ 9 పదార్థాలూ చాలా ఖరీదు!

Not Just Saffron These 9 Food Items Grown In India Are Very Expensive
  • నాణ్యమైన కశ్మీరీ కుంకుమపువ్వు కొన్ని గ్రాములకే రూ.వేల ధర
  • ఘాటు సువాసన, అంతర్జాతీయ డిమాండ్‌ కారణంగా పచ్చి యాలకులకు భారీ ధర
  • వెనిల్లా పువ్వులకు సాధారణంగా చేతితోనే పరాగసంపర్కం
  • హిమాలయ ప్రాంతాల్లో లభించే చిల్గోజా పప్పు
  • నాణ్యమైన జాపత్రికి మంచి ధర
  • ఎండిన కోకుమ్‌, దాని ఉత్పత్తులకు భారీ ధర
భారత్‌ వ్యవసాయ వైవిధ్యానికి పెట్టింది పేరు. మన వంటల్లో సాధారణంగా ఉపయోగించే మసాలాల నుంచి.. అరుదుగా లభించే విలువైన గింజలు, సుగంధ ద్రవ్యాలు, పండ్ల వరకు ఎన్నో ప్రత్యేకమైన పదార్థాలు ఇక్కడ పండుతాయి. వీటిలో కొన్నింటి ధరలు సాధారణ పదార్థాలతో పోలిస్తే చాలా ఎక్కువ. ప్రత్యేక వాతావరణం, పరిమిత దిగుబడి, సాగులో ఉండే శ్రమ వంటి కారణాలతో ఖరీదైనవిగా మారిన భారత్‌లోని 9 ఆహార పదార్థాలేంటో చూద్దాం.

1. కశ్మీరీ కుంకుమపువ్వు
కశ్మీర్‌లోని పాంపోర్‌ ప్రాంతంలో ప్రధానంగా సాగు చేసే కుంకుమపువ్వును ‘ఎర్ర బంగారం’గా పిలుస్తారు. కుంకుమ పువ్వులోని సున్నితమైన ఎర్రని కేశరాలను చేతితోనే సేకరించాలి. ఒక్కో పువ్వు నుంచి చాలా తక్కువ పరిమాణంలో మాత్రమే ఇది లభిస్తుంది. దీంతో దీని సాగు, కోత చాలా శ్రమతో కూడుకున్నది. నాణ్యమైన కశ్మీరీ కుంకుమపువ్వు కొన్ని గ్రాములకే రూ.వేలు పలుకుతుంది.

2. పచ్చి యాలకులు
టీ, బిర్యానీ, స్వీట్లలో కొద్దిగా మాత్రమే ఉపయోగించినా పచ్చి యాలకులు ఖరీదైన సుగంధ ద్రవ్యాల్లో ఒకటి. కేరళ, కర్ణాటక, తమిళనాడులో వీటి సాగు ఎక్కువగా జరుగుతుంది. వెచ్చని, తేమతో కూడిన వాతావరణంతో పాటు ప్రత్యేకమైన సంరక్షణ అవసరం. యాలకులను సరైన దశలోనే కోయాలి. ఘాటు సువాసన, అంతర్జాతీయంగా ఉన్న డిమాండ్‌ వీటి ధరను పెంచుతాయి.

3. సహజ వెనిల్లా
వెనిల్లా రుచి కలిగిన ఉత్పత్తులు ఎన్నో ఉన్నప్పటికీ సహజ వెనిల్లా మాత్రం చాలా ఖరీదైన పదార్థం. కేరళ, కర్ణాటక, తమిళనాడు వంటి దక్షిణాది రాష్ట్రాల్లో దీనిని సాగు చేస్తారు. వెనిల్లా పువ్వులకు సాధారణంగా చేతితోనే పరాగసంపర్కం చేయాల్సి ఉంటుంది. కోత తర్వాత కూడా కాయలను ప్రత్యేక పద్ధతిలో ఎక్కువ కాలం శుద్ధి చేయాలి. ఈ శ్రమ, సమయం కారణంగా సహజ వెనిల్లా సింథటిక్‌ వెనిల్లా ఫ్లేవర్‌ కంటే చాలా ఖరీదుగా ఉంటుంది.

4. చిల్గోజా పప్పు
హిమాలయ ప్రాంతాల్లో లభించే చిల్గోజా పప్పు భారత్‌లోని ఖరీదైన గింజల్లో ఒకటి. హిమాచల్‌ప్రదేశ్‌, జమ్మూకశ్మీర్‌లోని ఎత్తైన ప్రాంతాల్లో పెరిగే పైన్‌ చెట్ల నుంచి ఇవి లభిస్తాయి. కొండ ప్రాంతాల్లో చెట్లపై పెరిగే కాయలను సేకరించడం చాలా కష్టంతో కూడుకున్న పని. పరిమితంగా మాత్రమే లభించడం, ప్రత్యేకమైన వెన్నలాంటి రుచి, పోషక విలువలు వీటికి అధిక డిమాండ్‌ తీసుకొస్తాయి.

5. జాపత్రి
జాజికాయ విత్తనాన్ని చుట్టుకుని ఉండే ఎర్రటి పొరనే జాపత్రి అంటారు. జాజికాయ, జాపత్రి రెండూ ఒకే పండు నుంచి లభించినా.. జాపత్రిని విడదీసి ప్రత్యేకంగా ఎండబెట్టాలి. కేరళతో పాటు దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో దీని ఉత్పత్తి జరుగుతుంది. బిర్యానీలు, మసాలా మిశ్రమాలు, ఊరగాయలు, స్వీట్లలో దీనిని ఉపయోగిస్తారు. ఒక్కో పండు నుంచి లభించే జాపత్రి పరిమాణం తక్కువగా ఉండటం వల్ల నాణ్యమైన జాపత్రికి మంచి ధర ఉంటుంది.

6. జాజికాయ
జాజికాయ చెట్టు పండులోని విత్తనమే జాజికాయ. కేరళలో దీనిని పెద్దఎత్తున సాగు చేస్తారు. ఘాటైన సువాసన, ప్రత్యేకమైన రుచి కలిగిన జాజికాయను గరం మసాలా, బిర్యానీ, బేకరీ పదార్థాలు, పండుగల స్వీట్లలో ఉపయోగిస్తారు. కుంకుమపువ్వు స్థాయిలో ఖరీదు లేకపోయినా.. నాణ్యమైన, సంపూర్ణ జాజికాయ సాధారణ పొడి మసాలాలతో పోలిస్తే ఎక్కువ ధర పలుకుతుంది.

7. కశ్మీరీ వాల్‌నట్స్‌
కశ్మీర్‌ దేశంలోనే ప్రముఖ వాల్‌నట్‌ సాగు చేసే ప్రాంతాల్లో ఒకటి. అక్కడ పండే వాటికి ప్రత్యేకమైన రుచి, నాణ్యత కారణంగా మంచి డిమాండ్‌ ఉంది. కొన్ని రకాల వాల్‌నట్స్‌కు పలుచని పెంకు ఉండటంతో లోపలి గింజను సులభంగా తీయొచ్చు. వాల్‌నట్‌ చెట్లు పూర్తిస్థాయిలో దిగుబడి ఇవ్వడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. దీర్ఘకాల సాగు, కోత, ప్రాసెసింగ్‌ ఖర్చులు నాణ్యమైన కశ్మీరీ వాల్‌నట్‌ ధరపై ప్రభావం చూపుతాయి.

8. లకడాంగ్‌ పసుపు
మేఘాలయలో సంప్రదాయంగా సాగు చేసే లకడాంగ్‌ పసుపు సాధారణ పసుపుతో పోలిస్తే ప్రత్యేకమైనది. ఇందులో కర్కుమిన్‌ శాతం అధికంగా ఉండటంతో పాటు రంగు కూడా గాఢంగా ఉంటుంది. ఘాటు రుచి, సహజమైన రంగు కారణంగా దీనికి దేశవ్యాప్తంగా గుర్తింపు పెరుగుతోంది. పరిమిత ప్రాంతాల్లో సాగు చేయడం, ప్రత్యేక లక్షణాలు ఉండటంతో సాధారణంగా దొరికే పసుపు కంటే ఇది ఖరీదుగా ఉంటుంది.

9. కోకుమ్‌
మహారాష్ట్ర, గోవా, కర్ణాటకతో పాటు పశ్చిమ తీర ప్రాంతాల్లో ప్రధానంగా పండే చిన్న ఊదా రంగు పండే కోకుమ్‌. దక్షిణ, పశ్చిమ భారత వంటకాలు, పానీయాల్లో దీనిని విరివిగా ఉపయోగిస్తారు. తాజా కోకుమ్‌ ధర ఎప్పుడూ ఎక్కువగా ఉండకపోయినా.. నాణ్యమైన ఎండిన కోకుమ్‌, దాని ఉత్పత్తులకు మాత్రం మంచి ధర ఉంటుంది. కాలానుగుణంగా మాత్రమే లభించడం, ఎండబెట్టడం వంటి ప్రక్రియలు ఖర్చును పెంచుతాయి.
Advertisement
Expensive Indian Spices
Kashmiri Saffron
Lakadong Turmeric
Chilgoza Pine Nuts
Natural Vanilla
Green Cardamom

More Telugu News