గుజరాత్‌కు తిరిగి వెళ్లాలనుకున్న హార్దిక్ పాండ్యా.. ఆ కండిషన్‌తో ఆఖ‌ర్లో బెడిసికొట్టిన డీల్!

Hardik Pandya wanted to return to Gujarat Titans but the deal failed due to captaincy condition
  • ముంబై ఇండియన్స్‌ను వీడాలని నిర్ణయించుకున్న హార్దిక్ పాండ్యా
  • తిరిగి గుజరాత్ టైటాన్స్‌కు వెళ్లేందుకు ఆసక్తి
  • కెప్టెన్సీ ఇవ్వాలనే షరతుతో విఫలమైన చర్చలు
  • కెప్టెన్సీ డిమాండ్‌ను తిరస్కరించిన గిల్, గుజరాత్ యాజమాన్యం
  • చెన్నై, కోల్‌కతాతోనూ చర్చలు జరుపుతున్న వైనం
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఐపీఎల్‌ భవిష్యత్తుపై నెలకొన్న ఉత్కంఠకు మరో కొత్త మలుపు తోడైంది. ముంబై ఇండియన్స్‌ను వీడాలని నిర్ణయించుకున్న అత‌డు, 2027 సీజన్‌కు ముందు తన పాత ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్‌తో చర్చలు జరిపిన‌ట్లు స‌మాచారం. అయితే, కెప్టెన్సీ పగ్గాలు తనకే ఇవ్వాలనే షరతు పెట్టడంతో ఈ డీల్ ముందుకు సాగలేదని తెలుస్తోంది. దీంతో అత‌ని భవిష్యత్తు మరింత సంక్లిష్టంగా మారింది.

'ఇండియన్ ఎక్స్‌ప్రెస్' కథనం ప్రకారం.. పాండ్యాను తిరిగి జట్టులోకి తీసుకునేందుకు గుజరాత్ ఫ్రాంచైజీ తొలుత సుముఖంగానే ఉంది. ఈ విషయాన్ని ప్రస్తుత కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో చర్చించగా, అత‌డు కూడా తన అంగీక‌రించాడు. కానీ, జట్టులోకి రావాలంటే కెప్టెన్సీ తనకే ఇవ్వాలని హార్దిక్ షరతు విధించడంతో నిర్ణయాధికారంలో ఉన్న ప్రతి ఒక్కరూ దీనికి 'నో' చెప్పినట్లు సమాచారం.

"అత‌డు తిరిగి రావడానికి ఫ్రాంచైజీకి ఎలాంటి అభ్యంతరం లేదు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తోనూ చర్చించాం, అత‌ను కూడా సరే అన్నాడు. కానీ, కెప్టెన్సీ షరతు పెట్టడంతో అందరూ వద్దన్నారు" అని ఫ్రాంచైజీ వర్గాలు తెలిపినట్లు సదరు పత్రిక పేర్కొంది.

అయితే, ఈ విషయంపై హార్దిక్ పాండ్యా ప్రతినిధిని సంప్రదించగా, అత‌డు భిన్నమైన వాదన వినిపించాడు. హార్దిక్ ఏ ఫ్రాంచైజీతోనూ నేరుగా బదిలీ లేదా ట్రేడ్ గురించి చర్చలు జరపలేదని స్పష్టం చేశాడు. ఏవైనా సంప్రదింపులు జరిగితే, అవి ముంబై ఇండియన్స్ ద్వారానే జరుగుతాయని తెలిపాడు. ప్రస్తుతం హార్దిక్ చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్‌తో కూడా ట్రేడింగ్ కోసం చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

హార్దిక్ పాండ్యా నాయకత్వంలోనే గుజరాత్ టైటాన్స్ 2022లో టైటిల్ గెలిచి, 2023లో ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అత‌డు తన పాత జట్టు ముంబై ఇండియన్స్‌కు తిరిగి వచ్చాడు. ముంబైలో రోహిత్ శర్మ స్థానంలో కెప్టెన్ అవ్వడంతో అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నాడు. డ్రెస్సింగ్ రూంలోనూ రోహిత్‌కు ఉన్నంత గౌరవం, పట్టు హార్దిక్‌కు లభించలేదని వార్తలు వచ్చాయి. మరోవైపు ముంబై యాజమాన్యం జట్టును పునర్‌నిర్మించాలని చూస్తోంది. ఈ క్రమంలో హార్దిక్‌తో సహా పలువురు సీనియర్లను వదులుకునే అవకాశం ఉంది.
Advertisement
Hardik Pandya
Gujarat Titans
Mumbai Indians
IPL Trading
Shubman Gill
IPL Captaincy News

More Telugu News