6 సీజీపీఏతో క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌ కూడా రాలేదు.. ఇప్పుడు మైక్రోసాఫ్ట్‌లో రూ.90 లక్షల ప్యాకేజీ!

Naman Bansal No campus placement with 6 CGPA now 90 lakh package at Microsoft
  • తక్కువ సీజీపీఏ కారణంగా క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌కు అర్హత కూడా సాధించని నమన్‌ బన్సల్‌
  • ఇంటర్న్‌షిప్‌లకు దరఖాస్తు చేసినా వరుస తిరస్కరణలు
  • తన ప్రోగ్రామింగ్‌ నైపుణ్యాలపై మరింత దృష్టి పెట్టిన నమన్‌
  • కోడ్‌ఫోర్సెస్‌లో క్యాండిడేట్‌ మాస్టర్‌ స్థాయికి చేరుకున్న వైనం
  • మేక్‌మైట్రిప్‌లో ఇంటర్న్‌ నుంచి ఇప్పుడు మైక్రోసాఫ్ట్‌ వరకు అద్భుత ప్రయాణం
కాలేజీలో మంచి మార్కులు లేకపోతే మంచి ఉద్యోగం దొరకదనే భయం చాలామంది విద్యార్థుల్లో ఉంటుంది. 6 సీజీపీఏతో చదువు పూర్తిచేసిన నమన్‌ బన్సల్‌కు ఈ భయం నిజంగానే అడ్డంకిగా మారింది. క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌కు అర్హత లేకపోవడంతో పాటు, ఇంటర్న్‌షిప్‌లకు దరఖాస్తు చేసినా వరుస తిరస్కరణలు ఎదురయ్యాయి. కానీ అక్కడితో ఆయన ప్రయాణం ఆగలేదు.

అకడమిక్‌ స్కోర్‌ బలంగా లేకపోవడంతో తన ప్రోగ్రామింగ్‌ నైపుణ్యాలపై నమన్‌ మరింత దృష్టి పెట్టారు. కాంపిటేటివ్‌ ప్రోగ్రామింగ్‌లో నైపుణ్యం పెంచుకుని కోడ్‌ఫోర్సెస్‌లో క్యాండిడేట్‌ మాస్టర్‌ స్థాయికి చేరుకున్నారు. రెజ్యూమేలో సీజీపీఏ కంటే తన టెక్నికల్‌ స్కిల్స్‌ను హైలైట్‌ చేశారు. చివరకు రిఫరల్‌ ద్వారా మేక్‌మైట్రిప్‌లో ఇంటర్న్‌షిప్‌ సాధించారు.

మేక్‌మైట్రిప్‌లో అనుభవం నమన్‌ కెరీర్‌కు కీలక మలుపుగా మారింది. ఆ తర్వాత ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ సంస్థ ‘డీఈ షా’లో ఫుల్‌టైమ్‌ ఉద్యోగం దక్కింది. మరింత అనుభవం సంపాదించిన తర్వాత.. ఒకప్పుడు సీజీపీఏ కారణంగా ఇంటర్న్‌షిప్‌ ఇవ్వని అడోబ్‌లోనే ‘మెంబర్‌ ఆఫ్‌ టెక్నికల్‌ స్టాఫ్‌’గా ఉద్యోగం సాధించారు. అక్కడ దాదాపు రెండేళ్లు పనిచేశారు.

ఆ తర్వాత నమన్‌ బన్సల్‌ కెరీర్‌ మరో స్థాయికి చేరింది. ప్రస్తుతం ఆయన మైక్రోసాఫ్ట్‌లో SDE-2గా పనిచేస్తున్నట్లు సమాచారం. ఆయన వార్షిక వేతనం సుమారు రూ.90 లక్షలుగా పేర్కొంటున్నారు. ఒకప్పుడు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌కు కూడా అర్హత లేని విద్యార్థి.. ఇప్పుడు ప్రపంచ దిగ్గజ కంపెనీలో పనిచేస్తున్నారు.

నమన్‌ కథ చెప్పే విషయం ఒక్కటే.. మార్కులు ఒక అవకాశాన్ని ఆపగలవు. కానీ, ప్రతిభను శాశ్వతంగా ఆపలేవు. ఎదురైన ప్రతి తిరస్కరణను తనను తాను మెరుగుపరుచుకునే అవకాశంగా మార్చుకున్నారు. చివరకు ఆ నైపుణ్యాలు ఆయనకు ఒక్కో తలుపు తెరిచాయి. సీపీపీఏతో కెరీర్‌ మొదలవుతుందేమో కానీ.. దాన్ని ఎక్కడికి తీసుకెళ్లాలో నిర్ణయించేది మన నైపుణ్యాలే.
Advertisement
Naman Bansal
Microsoft 90 Lakh Package
Low CGPA Success Story
Software Development Engineer
Coding Skills over Marks
Naman Bansal Microsoft Career

More Telugu News