ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత మారిన పాక్‌ వ్యూహం.. ఉగ్ర సంస్థలపై ఐఎస్ఐ పట్టు

ISI takes direct control of terror groups after Operation Sindoor
  • లష్కరే, జైష్‌, హిజ్బుల్‌ కార్యకలాపాలను నేరుగా పర్యవేక్షిస్తున్న ఐఎస్‌ఐ
  • ఇప్పటివరకు ఈ మూడు సంస్థలకు వేర్వేరు కమాండ్‌ కేంద్రాలు
  • ఇక్బాల్‌, ఒవైజ్‌ అనే ఇద్దరు ఐఎస్ఐ అధికారుల పర్యవేక్షణలో 3 సంస్థలు
  • భారత్‌లోకి చొరబాట్ల విషయంలోనూ ఐఎస్ఐ కొత్త విధానం
  • ముగ్గురితో కూడిన బృందాలను పంపుతున్నట్లు సమాచారం
పాకిస్థాన్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్ర సంస్థల కార్యకలాపాల తీరు మారినట్లు భారత నిఘా వర్గాలు గుర్తించాయి. ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత లష్కర్‌-ఏ-తోయిబా, జైష్‌-ఏ-మహ్మద్‌, హిజ్బుల్‌ ముజాహిదీన్‌ల కార్యకలాపాలపై పాకిస్థాన్‌ గూఢచార సంస్థ ఐఎస్ఐ నేరుగా పట్టు సాధించినట్లు సమాచారం.

ఇప్పటివరకు ఈ మూడు సంస్థలకు వేర్వేరు కమాండ్‌ కేంద్రాలు ఉండేవి. చొరబాట్లు, ఇతర కార్యకలాపాలను ఆయా సంస్థల నేతలు, హ్యాండ్లర్లు పర్యవేక్షించేవారు. తాజాగా ఈ విధానాన్ని మార్చినట్లు అధికారులు తెలిపారు. బ్రిగేడియర్‌ ఇక్బాల్‌, కల్నల్‌ ఒవైజ్‌ అనే ఇద్దరు ఐఎస్ఐ అధికారులు మూడు సంస్థల కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు. వారి అనుమతి తర్వాతే కీలక చర్యలు ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు.

చొరబాట్ల విషయంలోనూ ఐఎస్ఐ కొత్త విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఐదారుగురు ఉగ్రవాదులు కలిసి చొరబడేందుకు ప్రయత్నించేవారు. ఇప్పుడు ముగ్గురితో కూడిన బృందాలను పంపుతున్నట్లు అధికారులు తెలిపారు. లష్కర్‌, జైష్‌, హిజ్బుల్‌ నుంచి ఒక్కొక్కరు ఉండేలా బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

నియంత్రణ రేఖ అవతల 500 మందికిపైగా ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు సిద్ధంగా ఉన్నట్లు నిఘా సంస్థలు గతంలో గుర్తించాయి. మరోవైపు జమ్మూకశ్మీర్‌లో స్థానిక యువతను ఆకర్షించేందుకు ఐఎస్ఐ ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆఫ్ఘనిస్థాన్‌, ఆఫ్రికాలో ఉన్న నెట్‌వర్క్‌ల ద్వారా యువతను ప్రభావితం చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు చెప్పారు.

ఎంపికైన యువతకు ఒంటరిగా దాడులు చేయడం, స్థానిక వస్తువులతో ఐఈడీల తయారీపై శిక్షణ ఇచ్చే అవకాశం ఉందని అధికారులు వివరించారు. దాడులకు పాకిస్థాన్‌ సంబంధం బయటపడకుండా జాగ్రత్త పడటమే ఈ వ్యూహం వెనుక ఉద్దేశమని తెలిపారు. ఉగ్ర సంస్థలపై నేరుగా నియంత్రణ తీసుకోవడం ద్వారా కార్యకలాపాల్లో సమన్వయం పెంచాలని ఐఎస్ఐ ప్రయత్నిస్తున్నట్లు నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Advertisement
ISI
Operation Sindoor
Lashkar e Taiba
Jaish e Mohammed
Jammu and Kashmir terrorism
Pakistan terror strategy

More Telugu News