వరుణయాగం ఎందుకు నిర్వహించరు?: టీటీడీపై భూమన తీవ్ర ఆగ్రహం

Bhumana Karunakar Reddy slams TTD for not conducting Varuna Yagam
  • రాష్ట్రంలో తీవ్ర కరవు పరిస్థితులు నెలకొన్నాయన్న భూమన
  • తిరుమల కొండపై కూడా జలాశయాలు ఎండిపోతున్నాయని ఆవేదన
  • వెంటనే వరుణయాగం చేపట్టాలని డిమాండ్

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రస్తుత పాలనపై వైసీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో తీవ్ర కరవు పరిస్థితులు నెలకొని, తిరుమల కొండపై ఉన్న జలాశయాలు సైతం ఎండిపోతున్నా టీటీడీ పాలకుల్లో చలనం లేకపోవడం శోచనీయమని మండిపడ్డారు. వర్షాలు సమృద్ధిగా కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ తక్షణమే వరుణయాగం నిర్వహించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.


వైసీపీ హయాంలో లోకకల్యాణం కోసం, ప్రజా శ్రేయస్సు కోసం టీటీడీ ఆధ్వర్యంలో ఎన్నో వైదిక కార్యక్రమాలు, హోమాలు, యాగాలు నిర్వహించామని భూమన గుర్తుచేశారు. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో టీటీడీ పాలకులు వేద, వైదిక సంప్రదాయాలను, శతాబ్దాల ఆచారాలను పూర్తిగా పక్కనపెట్టి భ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపించారు. కేవలం వీఐపీ సేవలకే ప్రాధాన్యం ఇస్తూ, ధార్మిక కార్యక్రమాలను తిలోదకాలు ఇచ్చారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా అధికారులు, పాలకులు బుద్ధి తెచ్చుకుని, సనాతన ధర్మ పరిరక్షణతో పాటు ప్రజాక్షేమం కోసం వెంటనే మేల్కొని వరుణయాగం చేపట్టాలని భూమన డిమాండ్ చేశారు.

Advertisement
Bhumana Karunakar Reddy
TTD
Varuna Yagam
Tirumala Tirupati Devasthanams
Tirumala drought
YSRCP

More Telugu News