రూ.1.87 లక్షలు.. ఆరుగురు స్నేహితులు: 50 ఏళ్ల హెచ్‌సీఎల్‌ జర్నీ ప్రారంభమైందిలా..!

HCL 50 Year Journey How Six Friends Started With 187 Lakhs
  • హెచ్‌సీఎల్‌ 50వ వార్షికోత్సవం సందర్భంగా సహ వ్యవస్థాపకుడి జ్ఞాపకాలు
  • రూ.1.87 లక్షలతో హెచ్‌సీఎల్‌ ప్రారంభం
  • ఢిల్లీలోని చిన్న బర్సాతీలో తొలి ఆఫీసు
  • ఐఐటీ ఖరగ్‌పూర్‌, ఐఐటీ మద్రాస్‌ నుంచి తొలి ఆర్డర్లు
  • కోయంబత్తూరులో ఓ ఆర్డర్‌తో మరిన్ని అవకాశాలు
ఐడియా పెద్దదైనంత మాత్రాన ఎక్కువ పెట్టుబడి కావాల్సిన అవసరం లేదని నిరూపించిన కథ ఇది. చేతిలో భారీగా నిధులు లేవు. పెద్ద ఆఫీసు లేదు. మార్కెట్‌లో పేరు లేదు. అయినా ఆరుగురు యువకులు ఒక కలను నమ్మారు. చేతిలో ఉన్న పొదుపు, అప్పులతో కలిపి రూ.1.87 లక్షలు సమకూర్చుకున్నారు. చివరకు ఆ ఆలోచనే భారత టెక్నాలజీ రంగాన్ని మార్చిన హెచ్‌సీఎల్‌గా ఎదిగింది.

హెచ్‌సీఎల్‌ సహ వ్యవస్థాపకుడు అజయ్‌ చౌదరి ఈ సంస్థ తొలి రోజుల్ని గుర్తుచేసుకుంటూ ‘ఎక్స్‌’లో సుదీర్ఘ పోస్టు చేశారు. హెచ్‌సీఎల్‌ 50వ వార్షికోత్సవం సందర్భంగా అప్పటి పరిస్థితులను ఆయన పంచుకున్నారు.

చేతిలో రూ.1.87 లక్షలు
1976లో కంప్యూటర్‌ అంటే భారత్‌లోనే కొత్త ఆలోచన. అలాంటి సమయంలో ఆరుగురు కలిసి సొంతంగా కంప్యూటర్‌ తయారు చేయాలని నిర్ణయించుకున్నారు. వారి దగ్గర భారీ పెట్టుబడిదారులు లేరు. వెంచర్‌ క్యాపిటల్‌ సంస్థల మద్దతు లేదు. ఆరుగురూ కలిసి రూ.1.87 లక్షలు సమకూర్చుకున్నారు. కొంత డబ్బు అప్పుగా తెచ్చారు. మరికొంత పొదుపు నుంచి పెట్టారు. ఓ సందర్భంలో కారును కూడా అమ్మేశారు.

చిన్న గదిలో తొలి అడుగు
ఢిల్లీలోని గోల్ఫ్‌ లింక్స్‌లో ఓ భవనంపై ఉన్న చిన్న గదే హెచ్‌సీఎల్‌ తొలి కార్యాలయమైంది. అప్పటికి వారు తయారు చేయాలనుకున్న కంప్యూటర్‌ పూర్తిగా సిద్ధం కాలేదు. బ్రోచర్‌ ఉంది. నమూనా ఉంది. యంత్రం మాత్రం ఇంకా రూపుదిద్దుకుంటోంది. అయినా ఆ ఆరుగురు వెనక్కి తగ్గలేదు. కంప్యూటర్‌ను విక్రయించేందుకు సంస్థలను కలవడం మొదలుపెట్టారు. తొలి ఆర్డర్లు ఐఐటీ ఖరగ్‌పూర్‌, ఐఐటీ మద్రాస్‌ నుంచి వచ్చాయి.

ఒక్క ఆర్డర్‌.. వరుసగా అవకాశాలు
వ్యాపార సంస్థలను ఒప్పించడం మాత్రం అంత సులభంగా జరగలేదు. కోయంబత్తూరులో డీసీఎం డీపీ అనే పెద్ద సంస్థ నుంచి గట్టి పోటీ ఎదురైంది. అక్కడ ప్రీమియర్‌ మిల్స్‌ రిసెప్షన్‌లో కూర్చుని ప్రత్యర్థి సంస్థ ప్రతినిధుల ప్రజెంటేషన్‌ను చూశారు. తర్వాత తమ వంతు వచ్చింది. అయినా ఆర్డర్‌ దక్కించుకున్నారు. ఆ ఒక్క ఆర్డర్‌ నుంచి మరో ఐదు ఆర్డర్లు వచ్చాయి. తర్వాత అవి పదయ్యాయి.

50 ఏళ్ల తర్వాత హెచ్‌సీఎల్‌ను చూస్తే అది టెక్నాలజీ దిగ్గజంగా కనిపిస్తుంది. కానీ దాని ఆరంభం మాత్రం చిన్న కార్యాలయం, పరిమిత డబ్బు, ఎన్నో తిరస్కరణలు, సాహసోపేతమైన ప్రయత్నాలతో జరిగింది. “పెద్ద కలలు కనండి. సాహసం చేయండి. ముఖ్యంగా.. ఆశయంతో ముందుకు సాగండి” అంటూ చౌదరి తన పోస్టును ముగించారు.
Advertisement
HCL
Ajai Chowdhry
HCL 50 Years Journey
Indian Tech History
Startup Success Story
Delhi

More Telugu News