పరుగులు పెడుతున్న ఏపీ ఆర్ధిక వ్యవస్థ.. జాతీయ సగటు కంటే మెరుగైన వృద్ధి

Andhra Pradesh Economy Surges With Growth Rate Higher Than National Average
  • జాతీయ సగటును మించి ఏపీ ఆర్ధిక వృద్ధి నమోదు
  • 2025-26లో 9.9 శాతానికి చేరిన రాష్ట్ర స్థూల ఉత్పత్తి వృద్ధి రేటు
  • వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల్లో గణనీయమైన ప్రగతి
  • ఎల్ నినో ప్రభావంపై సీఎం చంద్రబాబు ఆందోళన
  • సంక్షోభంలోనూ 15% వృద్ధి లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు ఆదేశం
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ స్థిరమైన వృద్ధి పథంలో పయనిస్తోంది. జాతీయ వృద్ధి రేటును అధిగమించి, వరుసగా రెండో ఏడాది కూడా రాష్ట్రం మెరుగైన ప్రగతిని నమోదు చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి (GSDP) వృద్ధి రేటు 9.9 శాతానికి చేరుకున్నట్లు జులై 2026 నెలవారీ ఆర్థిక నివేదిక స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడుకు ప్రణాళికా విభాగం అధికారులు ఈ నివేదికను సమర్పించారు.

నివేదిక ప్రకారం, వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల్లో రాష్ట్రం గణనీయమైన వృద్ధిని సాధించింది. 2025-26 రెండో త్రైమాసికంలో వ్యవసాయ రంగం 13.5 శాతం, పారిశ్రామిక రంగం 10.6 శాతం, సేవా రంగం 9.9 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ముఖ్యంగా సుగంధ ద్రవ్యాల ఉత్పత్తి 304 శాతం, వాణిజ్య వాహనాల విక్రయాలు 51.6 శాతం, ఎస్‌టిపిఐ (STPI) ఎగుమతులు 32.2 శాతం మేర పెరిగాయి. సాంకేతికత వినియోగం ద్వారా జీఎస్టీ వసూళ్లు 21 శాతం వృద్ధితో రూ.13,282 కోట్లకు చేరాయి. రాష్ట్రంలోకి పెట్టుబడుల ప్రవాహం కూడా ఆశాజనకంగా ఉంది. రూ. 2.88 లక్షల కోట్ల విలువైన మెగా ప్రాజెక్టుల పెట్టుబడుల్లో 75.4 శాతం మేర గ్రౌండింగ్ పూర్తయింది.

ఈ నివేదికను సమీక్షించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్రం ఎదుర్కొంటున్న ప్రస్తుత సవాళ్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఎల్ నినో ప్రభావంతో వర్షపాతం తక్కువగా నమోదైందని, కృష్ణా నదిలో నీటి లభ్యత లేక శ్రీశైలం, నాగార్జునసాగర్ వంటి ప్రధాన ప్రాజెక్టులు నిండలేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి సంక్షోభ పరిస్థితుల్లోనూ రాష్ట్ర స్థూల ఉత్పత్తి లక్ష్యాలు దెబ్బతినకుండా పటిష్ఠమైన కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

రాష్ట్రం 15 శాతం వృద్ధి రేటును సాధించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం స్పష్టం చేశారు. అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించుకోవాలని, ప్రజలపై ధరల భారం పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జిల్లా, నియోజకవర్గం, మండలాల వారీగా నివేదికలు రూపొందిస్తే లక్ష్యాల సాధన సులభమవుతుందని పేర్కొన్నారు. ఈ సమీక్షా సమావేశంలో ఆర్థిక, ప్రణాళికా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Advertisement
Andhra Pradesh
Chandrababu Naidu
AP Economy Growth
GSDP Growth Rate
AP Industrial Sector
AP Agriculture Growth

More Telugu News