డీఎస్సీ వ్యవహారంపై సీబీఐ విచారణ జరగాల్సిందే.. నారా లోకేశ్ తక్షణమే రాజీనామా చేయాలి: రోజా

RK Roja demands CBI probe into DSC scam and Nara Lokesh resignation
  • పుత్తూరులో రోజా ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ
  • డీఎస్సీలో భారీగా అక్రమాలు, అవకతవకలు జరిగాయన్న రోజా
  • నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవద్దని ప్రభుత్వానికి హితవు

కూటమి ప్రభుత్వం చేపట్టిన మెగా డీఎస్సీలో భారీగా అక్రమాలు, అవకతవకలు జరిగాయని, ఈ కుంభకోణానికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు ఆర్కే రోజా డిమాండ్ చేశారు. నిరుద్యోగులను నట్టేట ముంచిన డీఎస్సీ ప్రక్రియపై సీబీఐ చేత తటస్థ విచారణ జరిపించాలని కోరుతూ నగరి నియోజకవర్గం పుత్తూరు పట్టణంలో ఆమె ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహం వద్ద ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.


కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మొట్టమొదటి ఉద్యోగ నోటిఫికేషన్‌లోనే పేపర్ లీకేజీలు, అవినీతి అక్రమాలు రాజ్యమేలాయని రోజా తీవ్రస్థాయిలో ఆరోపించారు. ప్రశ్నాపత్రాన్ని తయారు చేసిన నవీన్ అనే వ్యక్తికే మొదటి ర్యాంక్ రావడమే పేపర్ లీక్ అయిందనడానికి సజీవ సాక్ష్యమని స్పష్టం చేశారు. పేపర్ లీకేజీ నిజం కాకపోతే మొదటి ర్యాంకర్ నవీన్‌కు ఉద్యోగం ఇవ్వకుండా, రెండో ర్యాంక్ నుంచి ఎందుకు నియామకాలు చేపట్టారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. మరోవైపు స్పోర్ట్స్ కోటా పేరుతో దొంగ జీవోలను తెచ్చి, పోస్టులను విచ్చలవిడిగా అమ్ముకుని రూ. కోట్లు దోచుకున్నారని మండిపడ్డారు. విద్యార్థులు, నిరుద్యోగుల భవిష్యత్తుతో ఆడుకోవడం ఆపి, వెంటనే పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పాటు నిరుద్యోగ భృతిని విడుదల చేయాలని ఆర్కే రోజా డిమాండ్ చేశారు.

Advertisement
RK Roja
Nara Lokesh
AP Mega DSC Scam
CBI Inquiry DSC
Andhra Pradesh Education News
YSRCP Protest

More Telugu News