రాయలసీమపై వైసీపీది కపట ప్రేమ.. ఇప్పుడు అభివృద్ధిని చూసి వాళ్ల‌కి కళ్లు మండుతున్నాయి: ఎమ్మెల్సీ భూమిరెడ్డి

Bhumireddy Ramgopal Reddy slams YSRCP for fake love towards Rayalaseema
  • రాయలసీమ అభివృద్ధిని చూసి వైసీపీ నేతల అసహనమ‌న్న భూమిరెడ్డి
  • ప్రాజెక్టుల పేరుతో విపక్ష నేతలవి తీర్థయాత్రలంటూ ఎద్దేవా
  • ఐదేళ్ల పాలనలో సీమను జగన్ పూర్తిగా విస్మరించారని విమర్శ
  • కూటమి ప్రభుత్వం రాయలసీమ అభివృద్ధికి కట్టుబడి ఉందని స్పష్టీకరణ
  • సీమను హార్టికల్చర్, పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దుతామని వెల్లడి
రాయలసీమ ప్రాంత అభివృద్ధి పరుగులు పెడుతుంటే చూసి ఓర్వలేక వైసీపీ నేతలు కళ్లు మూసుకుని విమర్శలు చేస్తున్నారని, రైతుల పేరుతో రాజకీయ డ్రామాలకు తెరలేపారని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఐదేళ్ల పాటు రాయలసీమను గాలికొదిలేసిన జగన్ రెడ్డి, ఇప్పుడు ప్రాజెక్టుల సందర్శనల పేరుతో తీర్థయాత్రలు చేయడం విడ్డూరంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. 

నేడు మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. "వంద పీనుగులను తిన్న రాబందు పాప ప్రక్షాళన కోసం తీర్థయాత్రలకు వెళ్లినట్లుగా ఉంది వైసీపీ నేతల తీరు" అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమ అభివృద్ధి చెందుతుండటాన్ని చూసి వైసీపీ నేతలు నీతులు మాట్లాడుతున్నారని, వారి మాయమాటలను సీమ ప్రజలు ఇక నమ్మరని హెచ్చరించారు.

ప్రాజెక్టులు కొట్టుకుపోతే ఏమయ్యారు?
వైసీపీ ప్రభుత్వ హయాంలో అన్నమయ్య, పింఛా ప్రాజెక్టులు కొట్టుకుపోయి వందలాది కుటుంబాలు వీధిన పడినప్పుడు జగన్ రెడ్డి ఎందుకు యాత్ర చేయలేదని భూమిరెడ్డి ప్రశ్నించారు. అన్నమయ్య ప్రాజెక్టు ఎందుకు తెగిపోయిందో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ అప్పుడే తాడేపల్లి వరకు పాదయాత్ర చేసి ఉంటే ప్రజలు నమ్మేవారని అన్నారు. గోరకల్లు, అలగనూరు రిజర్వాయర్ల కట్టలు కుంగిపోయినా కనీసం మరమ్మతులకు నిధులు ఇవ్వలేదని, వీటిపై వైసీపీ నేతలు ఎందుకు పాదయాత్రలు చేయలేదని నిలదీశారు. చంద్రబాబు ప్రభుత్వం రాయలసీమ రైతుల కన్నీళ్లు తుడవడానికి ప్రయత్నిస్తుంటే, వైసీపీ నాయకులు నానాయాగీ చేస్తున్నారని విమర్శించారు.

ఒక్క కలం పోటుతో 102 ప్రాజెక్టులకు అడ్డుకట్ట
రాయలసీమ సమగ్రాభివృద్ధి కోసం గత టీడీపీ ప్రభుత్వం 102 ప్రాజెక్టులను మంజూరు చేస్తే, జగన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే జీఓ నంబర్ 365తో ఒక్క కలం పోటుతో ఆ ప్రాజెక్టులన్నింటినీ అడ్డుకున్నారని భూమిరెడ్డి ఆరోపించారు. దశాబ్దాలుగా తమను గెలిపిస్తున్న రాయలసీమ ప్రజలపై జగన్ రెడ్డి ఎందుకు కక్ష కట్టారని ప్రశ్నించారు. కర్నూలు పశ్చిమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే వేదవతి, గుండ్రేవుల ప్రాజెక్టులను అధికారంలోకి రాగానే ఎందుకు రద్దు చేశారని నిలదీశారు. ఆ ప్రాజెక్టులు కొనసాగించి ఉంటే ఆ ప్రాంతంలో వలసలు ఆగిపోయేవని అన్నారు.

రాయలసీమ ఎత్తిపోతలపై జగన్ సర్కార్ ద్రోహం
రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఇప్పుడు మాట్లాడుతున్న వైసీపీ నేతలు, వారి ప్రభుత్వ హయాంలో జరిగిన నిర్వాకాన్ని గుర్తుచేసుకోవాలని భూమిరెడ్డి హితవు పలికారు. రూ.3,825 కోట్ల అంచనాతో పథకాన్ని ప్రారంభించి, ఐదు నెలల్లోనే దొంగ బిల్లులతో రూ.950 కోట్లు స్వాహా చేశారని ఆరోపించారు. 2020 అక్టోబర్‌లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) స్టే ఇస్తే, నాలుగేళ్ల పాటు ఆ స్టేను ఎత్తివేయడానికి జగన్ ప్రభుత్వం ఎందుకు ప్రయత్నించలేదని ప్రశ్నించారు. పర్యావరణ అనుమతుల కోసం ఒక్క పత్రం కూడా 'పరివేశ్' పోర్టల్‌లో అప్‌లోడ్ చేయలేదని, ఇది రాయలసీమకు చేసిన ద్రోహం కాదా అని నిలదీశారు. అంతేకాకుండా, ఈ పథకాన్ని చెన్నై తాగునీటి అవసరాల కోసం నిర్మిస్తున్నట్లు జీఓ ఇవ్వడం రాయలసీమ ప్రజలను వంచించడమేనని అన్నారు.

పులివెందులకు నీళ్లిచ్చింది చంద్రబాబే
జగన్ రెడ్డి ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నా తన సొంత నియోజకవర్గం పులివెందులలో ఒక్క ఎకరాకు కూడా అదనంగా సాగునీరు ఇవ్వలేకపోయారని భూమిరెడ్డి విమర్శించారు. రాజకీయాలకు అతీతంగా చంద్రబాబు నాయుడు పులివెందులకు కృష్ణా జలాలు తీసుకువచ్చి ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన ఘనతను జగన్ రెడ్డి గుర్తించాలని అన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం హంద్రీ-నీవా ద్వారా కృష్ణా జలాలను రాష్ట్ర సరిహద్దుల్లోని కుప్పం వరకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తోందని తెలిపారు. సాగునీటి ప్రాజెక్టుల ఆధునీకరణకు రాబోయే రెండేళ్లలో రూ.10 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు.

అభివృద్ధి, ఉపాధితో రాయలసీమకు కొత్త శోభ
రాయలసీమను దేశంలోనే ప్రధాన హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు వేల కోట్ల రూపాయలతో ప్రణాళికలు సిద్ధం చేశామని భూమిరెడ్డి తెలిపారు. మదనపల్లిలో త్వరలో చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. పరిశ్రమలు, ఉపాధి అవకాశాలతో రాయలసీమకు కొత్త రూపు తీసుకువస్తున్నామని అన్నారు. జమ్మలమడుగులో జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ప్లాంట్, సత్యసాయి జిల్లాలో జెట్ ఫైటర్ల తయారీ కర్మాగారాలు, కొప్పర్తిలో ఎలక్ట్రానిక్ పరిశ్రమలు, ఓర్వకల్లులో డ్రోన్ తయారీ యూనిట్లు ఏర్పాటవుతున్నాయని వివరించారు. 

ఈ అభివృద్ధిని చూసి ఓర్వలేకే వైసీపీ నేతలు మళ్లీ ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టాలని చూస్తున్నారని, వారి కుట్రలు ఫలించవని హెచ్చరించారు. రైతులు కోరిన వెంటనే 90 శాతం సబ్సిడీతో డ్రిప్ పరికరాలు అందిస్తున్నా యాత్రలు చేయడం వైసీపీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు. రాయలసీమ ప్రజలు వాస్తవాలను గమనిస్తున్నారని, వైసీపీ రాజకీయ ప్రచారాలను నమ్మే స్థితిలో లేరని భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.
Advertisement
Bhumireddy Ramgopal Reddy
Rayalaseema Development
TDP vs YSRCP
Jagan Mohan Reddy
Andhra Pradesh Irrigation Projects
Chandrababu Naidu

More Telugu News