ఆనం అంటేనే అవినీతి: మేకపాటి విక్రమ్ రెడ్డి
- ఆత్మకూరులో ఇసుక దందా రాజ్యమేలుతోందన్న విక్రమ్ రెడ్డి
- ఆనం ధనదాహానికి ఏడుగురు బలి అయ్యారని ఆరోపణ
- జగన్ ను తిట్టి మంత్రి పదవి తెచ్చుకున్నారని ఎద్దేవా
ఆత్మకూరు నియోజకవర్గంలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని ప్రశ్నించడమే పెద్ద పాపమన్నట్లుగా అధికారులు, పోలీసులు వ్యవహరిస్తున్నారని వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నియోజకవర్గంలో మేకపాటి కుటుంబానికి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం ఉందని, తమ అభిమానులను, సానుభూతిపరులను ఉద్దేశించి మంత్రి నీచమైన వ్యాఖ్యలు చేయడం తగదని హితవు పలికారు.
ఆనం గెలిచినప్పటి నుంచి ఆత్మకూరులో ఇసుక దందా, చికెన్ వేస్ట్ మాఫియాలు విచ్చలవిడిగా రాజ్యమేలుతున్నాయని, మర్రిపాడులో ఇసుక కొండనే మాయం చేశారని విక్రమ్‌రెడ్డి ఆరోపించారు. మంత్రి ధనదాహానికి ఏడుగురు బలికావడమే కాకుండా, చివరకు పోలీస్ స్టేషన్ల నుంచే మామూళ్లు వసూలు చేసే నీచ సంస్కృతికి తెరతీశారని దుయ్యబట్టారు. ఐదేళ్లకోసారి పార్టీలు మారే ఊసరవెల్లి నైజం ఆనందేనని, జగన్‌ను తిట్టి మంత్రి పదవి తెచ్చుకున్న చరిత్రహీనుడని ఎద్దేవా చేశారు. కేవలం ఇసుక దందా ద్వారానే నెలకు రూ.3 కోట్లు ఆర్జిస్తున్నారని విమర్శిస్తూ.. "ఆనం అంటే అవినీతి, అవినీతి అంటే ఆనం" అని అభివర్ణించారు. తనపై చేసిన ఆరోపణలను నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకోవడానికైనా, రాజీనామా చేయడానికైనా సిద్ధమని, ఈ సవాల్‌ను స్వీకరించే దమ్ము ఆనంకు ఉందా అని నిలదీశారు.