రాజకీయ వైరాలు పక్కనబెట్టి ఒకే చోట.. రేవతి సూలే రిసెప్షన్‌లో ప్రధాని మోదీ, అమిత్ షా, రాహుల్ గాంధీ
- వైభవంగా సుప్రియా సూలే కుమార్తె రేవతి సూలే వివాహ రిసెప్షన్
- రిసెప్షన్ కు తరలి వచ్చిన అగ్ర రాజకీయ నేతలు
- ఆప్యాయంగా పలకరించుకున్న నేతలు
ఢిల్లీ వేదికగా దేశ రాజకీయాలలోని దిగ్గజ నేతలందరూ ఒకే వేదికపై కొలువుదీరిన ఒక అరుదైన, ఆసక్తికర ఘట్టం ఆవిష్కృతమైంది. ఎన్సీపీ (ఎస్పీ) వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ సుప్రియా సూలే కుమార్తె రేవతి సూలే - సారంగ్ లఖానీల వివాహ రిసెప్షన్ వేడుక దేశ రాజధానిలోని శరద్ పవార్ నివాసంలో అత్యంత వైభవంగా జరిగింది. నిత్యం రాజకీయ ప్రత్యర్థులుగా పార్లమెంటులోనూ, పబ్లిక్ వేదికలపై సవాళ్లు విసురుకునే అగ్ర నేతలందరూ తమ వైరి వర్గాలను పక్కనబెట్టి ఈ వేడుకకు హాజరయ్యారు.
ఈ రిసెప్షన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీలతో పాటు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ తదితర ప్రముఖులు విచ్చేసి కొత్త దంపతులను ఆశీర్వదించారు. ప్రధాని మోదీ, అమిత్ షా, శరద్ పవార్ ఒకే ఫ్రేమ్‌లో నిలిచి ఆప్యాయంగా పలకరించుకోవడం, రాహుల్-సోనియా కుటుంబ సమేతంగా పవార్ కుటుంబంతో ముచ్చటించడం నెటిజన్లు, మీడియా దృష్టిని విశేషంగా ఆకర్షించింది.