యుద్ధ నేరాల కేసులో సిరియా మాజీ అధ్యక్షుడు అసద్‌కు మరణశిక్ష

Bashar al Assad sentenced to death in war crimes case
  • బషర్‌ అల్‌ అసద్‌కు మరణశిక్ష
  • అసద్‌ తమ్ముడు మహెర్‌కూ అదే శిక్ష
  • సమీప బంధువు అతీఫ్‌ నజీబ్‌కూ మరణశిక్ష
  • యుద్ధ నేరాలు, మానవ హక్కుల ఉల్లంఘనల నేరాలపై తీర్పు
  • చిన్నారుల హత్య, హింసతో దోషిగా తేలిన నజీబ్‌
సిరియా మాజీ అధ్యక్షుడు బషర్‌ అల్‌ అసద్‌కు మరణశిక్ష విధించారు. 14 ఏళ్ల సిరియా అంతర్యుద్ధం సమయంలో జరిగిన యుద్ధ నేరాలు, మానవ హక్కుల హననానికి సంబంధించిన కేసులో ఆయన్ను దోషిగా తేల్చిన కోర్టు కఠిన శిక్ష విధించింది. అసద్‌ ప్రస్తుతం దేశంలో లేకపోవడం గమనార్హం.

అసద్‌ తమ్ముడు మహెర్‌ అల్‌ అసద్‌కు కూడా ఇదే కేసులో మరణశిక్ష పడింది. సిరియా సైన్యంలో కీలక బాధ్యతలు నిర్వహించిన ఆయన.. మాజీ పాలకుడి పాలనలో సైనిక వ్యవహారాల్లో ముఖ్య పాత్ర పోషించారు.

అసద్‌కు మరో దగ్గరి బంధువు అతీఫ్‌ నజీబ్‌కు కూడా మరణశిక్ష విధించారు. 2011లో దక్షిణ సిరియాలోని దారా ప్రావిన్స్‌లో రాజకీయ భద్రతా విభాగానికి ఆయన అధిపతిగా ఉన్నారు. ఆ సమయంలో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలను అణచివేయడంలో కీలక పాత్ర పోషించినట్లు కోర్టు పేర్కొంది.

15 ఏళ్లలోపు చిన్నారులను ఉద్దేశపూర్వకంగా హతమార్చడం, హింసకు పాల్పడి మరణాలకు కారణం కావడం వంటి నేరాలకు నజీబ్‌ పాల్పడ్డారని కోర్టు నిర్ధారించింది. 

సిరియాలో కొత్తగా ఏర్పడిన తాత్కాలిక పాలకుల హయాంలో మాజీ ప్రభుత్వ నేతలపై జరుగుతున్న విచారణల్లో ఇది కీలక పరిణామంగా నిలిచింది. గత ప్రభుత్వంలో పనిచేసిన పలువురిపై ప్రస్తుతం కేసులు నడుస్తున్నాయి.

ఇస్లామిస్ట్‌ నేతృత్వంలోని బలగాలు డమాస్కస్‌ వైపు దూసుకెళ్లడంతో 2024 డిసెంబరులో అసద్‌ కుటుంబంతో కలిసి సిరియా నుంచి పారిపోయారు. అనంతరం మాస్కోలో ఆశ్రయం పొందారు. మరోవైపు నజీబ్‌ను అరెస్టు చేసి విచారణకు హాజరుపరిచారు. మాజీ ప్రభుత్వంలో విచారణ ఎదుర్కొంటున్న అత్యున్నత స్థాయి అధికారుల్లో ఆయన ఒకరు.


Advertisement
Bashar al Assad
Syria war crimes
Maher al Assad
Atif Najib
Syria civil war
Death sentence

More Telugu News