భారతీయ మహిళలకు పెళ్లి ఓ ట్రామా.. అత్తారింటికి వెళ్లడం వారికి మానసిక క్షోభే: కిరణ్ బేడీ

Kiran Bedi says marriage is a trauma for Indian women and moving to in-laws house is mental agony
  • భారతీయ మహిళలకు వివాహం ఓ ట్రామా లాంటిదన్న కిరణ్ బేడీ
  • పుట్టింటిని వదిలి అత్తారింట్లో సర్దుకుపోవడం పెద్ద సవాల్ అని వెల్లడి
  • పెళ్లి తర్వాత ఉద్యోగం మానేయొద్దని మహిళలకు సూచన
  • ఇంటి పనులను భర్తతో పంచుకోవాలని, ఆర్థిక స్వాతంత్ర్యం సాధించాలని సలహా
భారతీయ మహిళలకు వివాహం అంటే వేడుక కాదు, అదొక పెద్ద ట్రామా (మానసిక గాయం) అని పుదుచ్చేరి మాజీ లెఫ్టినెంట్ గవర్నర్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి డాక్టర్ కిరణ్ బేడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ... పెళ్లిళ్లు చూడటానికి పండగలా కనిపించినా, సురక్షితమైన పుట్టింటిని వదిలి కొత్త ఇంట్లోకి వెళ్లడం మహిళలకు తీవ్రమైన భావోద్వేగ, మాన‌సిక‌ సవాళ్లను తెచ్చిపెడుతుందని అన్నారు.

కొత్తగా పెళ్లయిన కోడలు అత్తమామలను సొంత తల్లిదండ్రుల్లా చూడాలని, భర్త కుటుంబ వాతావరణానికి పూర్తిగా అలవాటు పడాలని, తన ఇష్టాలతో సంబంధం లేకుండా గృహిణి పాత్రను స్వీకరించాలని సమాజం ఆశిస్తుందని ఆమె పేర్కొన్నారు. ఈ అంచనాల గురించి పెళ్లికి ముందే జంటలు ఎందుకు చర్చించుకోవని ఆమె ప్రశ్నించారు. పెళ్లి తర్వాత కూడా ఉద్యోగం కొనసాగిస్తామని, అవసరమైతే ఇంట్లో సహాయానికి మనిషిని పెట్టుకుంటామని, ఇంటి పనులను భర్తతో పంచుకుంటామని మహిళలు ధైర్యంగా చెప్పాలని ఆమె సూచించారు.

పెళ్లి తర్వాత మగవారు ఉద్యోగాలు మానరని, కానీ చాలా మంది మహిళలు వృత్తిని వదిలేస్తున్నారని కిరణ్ బేడీ ఆవేదన వ్యక్తం చేశారు. వివాహం, పిల్లలు పుట్టిన తర్వాత మహిళా ఉద్యోగుల సంఖ్య తగ్గడానికి ఇదే కారణమని ఆమె విశ్లేషించారు. అత్తారింట్లో మద్దతు లభించని పక్షంలో ఆర్థిక స్వాతంత్ర్యంతో ధైర్యంగా తల్లిదండ్రుల వద్దకు తిరిగి వెళ్లేందుకు సంకోచించవద్దని, సమాజం అలాంటి నిర్ణయాలను విమర్శించకుండా సానుకూలంగా చూడాలని ఆమె అభిప్రాయపడ్డారు.
Advertisement
Kiran Bedi
Indian Marriage Trauma
Women Empowerment
Financial Independence
Career After Marriage
Gender Equality

More Telugu News