మెడికో ప్రియాంక మృతి.. నిందితులను కఠినంగా శిక్షించాలన్న తెలంగాణ ప్రభుత్వం

Medico Priyanka death Telangana government demands strict punishment for culprits
  • రాజమండ్రిలో కారు ప్రమాదంలో గాయపడిన మెడికో ప్రియాంక మృతి
  • నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసిన తెలంగాణ ప్రభుత్వం
  • ఏపీ సీఎంతో మాట్లాడతానని హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
  • ప్రియాంక కుటుంబానికి ఏపీ ప్రభుత్వం రూ. 20 లక్షల పరిహారం ప్రకటన
  • మద్యం మత్తులో ఈ ఘోరానికి పాల్పడిన నిందితులు
ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరంలో గత వారం మాల్ వద్ద కారుతో ఢీకొట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడిన తెలంగాణ మెడికో కె. ప్రియాంక (28) చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటనకు బాధ్యులైన నిందితులను అత్యంత కఠినంగా శిక్షించాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేసింది. ఇవాళ‌ పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, గాంధీ ఆసుపత్రికి వెళ్లి ప్రియాంక కుటుంబ సభ్యులను పరామర్శించారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూసేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడతారని ఆయన హామీ ఇచ్చారు.

అసలేం జరిగింది?
తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా, ఏక్లాస్‌పూర్ గ్రామానికి చెందిన ప్రియాంక, రాజమహేంద్రవరంలోని జీఎస్ఎల్ మెడికల్ కాలేజీలో ఎండీ చదువుతున్నారు. ఈ నెల‌ 3వ తేదీ రాత్రి, తన స్నేహితుడు ఉమేశ్‌తో కలిసి స్కూటీపై మాల్ నుంచి బయటకు వస్తుండగా ఈ ఘోరం జరిగింది. మద్యం మత్తులో ఉన్న సురవరపు దశవంత్, ఆండ్రూ ఎడ్వర్డ్స్ అనే ఇద్దరు వ్యక్తులు మాల్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా, సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో వారితో గొడవపడి, దాడి చేసి, అక్కడి నుంచి కారులో వేగంగా పారిపోయే ప్రయత్నంలో మాల్ గేటు వద్ద ఉన్న ప్రియాంక స్కూటీని మూడుసార్లు ఢీకొట్టారు.

ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రియాంకను మొదట స్థానిక ఆసుపత్రికి, ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆమెను వైద్యులు బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించగా, నిన్న‌ తుదిశ్వాస విడిచారు. ఆమె మృతదేహానికి గాంధీ ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించి, అంత్యక్రియల నిమిత్తం స్వగ్రామానికి తరలించనున్నారు.

ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించి, ప్రియాంక కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. మొదట నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు, ప్రియాంక మరణంతో ఇప్పుడు ఆ సెక్షన్‌ను హత్యా నేరంగా మార్చే అవకాశం ఉంది. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలని ప్రియాంక తండ్రి వెంకటేశ్‌ రాజమహేంద్రవరంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో నిందితులకు కఠిన శిక్ష పడితే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని మంత్రి శ్రీహరి అభిప్రాయపడ్డారు. ప్రియాంక కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.
Advertisement
Medico Priyanka
Rajamahendravaram car accident
Telangana government
Chandrababu Naidu
Revanth Reddy
Drunk driving case

More Telugu News