ఇదేం ప్లానింగ్ రా బాబు.. బెంగళూరు యువతుల వంట మెనూ చూస్తే షాకే!

ఇదేం ప్లానింగ్ రా బాబు.. బెంగళూరు యువతుల వంట మెనూ చూస్తే షాకే!

What a planning Shocking cooking menu of Bengaluru girls goes viral
  • బెంగళూరు ఫ్లాట్‌మేట్స్ వంట మెనూ వాట్సాప్ చాట్ వైరల్
  • 'బడ్డీ నివాస్ కుకింగ్' గ్రూప్‌లో ఒక్కోరికి ఒక్కో రకమైన ఆర్డర్
  • కాశ్వి సక్సేనా అనే యువతి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వెలుగులోకి
  • ఇద్దరు వంట మనుషులతో విభిన్నమైన వంటకాలు చేయించుకుంటున్న యువతులు
  • వారి ప్లానింగ్, సమన్వయం చూసి ఆశ్చర్యపోతున్న నెటిజన్లు
సాధారణంగా ఫ్లాట్‌లో కలిసి ఉండే స్నేహితులు వంట విషయంలో ఒకరికొకరు సర్దుకుపోతారు. కానీ, బెంగళూరుకు చెందిన కొందరు యువతులు మాత్రం ఈ విషయంలో ఓ రేంజ్‌లో ప్లానింగ్ చేసుకుంటున్నారు. వారు తమ వంట మనుషుల కోసం ఏర్పాటు చేసుకున్న ఓ వాట్సాప్ గ్రూప్, అందులోని భోజనం మెనూ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వివరాలు చూసిన నెటిజన్లు 'ఇదేం ప్లానింగ్ రా బాబు' అంటూ ఆశ్చర్యపోతున్నారు.

వివరాల్లోకి వెళితే.. బెంగళూరులో కాశ్వి, ఊర్వశి, పరి, ఇషిక అనే నలుగురు యువతులు ఒకే ఫ్లాట్‌లో నివాసం ఉంటున్నారు. వీరికి వంట చేసి పెట్టేందుకు సరిత, సునీత అనే ఇద్దరు మహిళలు ఉన్నారు. ఈ నలుగురు ఫ్లాట్‌మేట్స్, ఇద్దరు వంట మనుషులతో 'బడ్డీ నివాస్ కుకింగ్' పేరుతో ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు. 

రోజూ ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఏం వండాలో ఈ గ్రూప్‌లోనే మెసేజ్ పెడతారు. అయితే, ఆ మెనూ సాధారణంగా కాకుండా, ఒక్కొక్కరికి ఒక్కో రకంగా, ఎంతో నిర్దిష్ట‌మైన సూచనలతో ఉండటమే ఇక్కడ విశేషం.

ఈ గ్రూప్ స్క్రీన్‌షాట్‌ను కాశ్వి సక్సేనా అనే యువతి ‘ఎక్స్‌’ (ట్విట్టర్) లో పోస్ట్ చేయడంతో ఇది వైరల్‌గా మారింది. ఆ మెసేజ్‌ల ప్రకారం.. బ్రేక్‌ఫాస్ట్ కోసం కాశ్వికి రెండు గుడ్లలోని తెల్లసొనతో మాత్రమే ఆమ్లెట్ కావాలి. అందులో మష్రూమ్స్, ఉల్లిపాయలు, టమాటా ఉండాలి కానీ, బ్రకోలీ, బ్రెడ్ అస్సలు ఉండకూడదు. 

ఇక, ఊర్వశికి రెండు గుడ్ల ఆమ్లెట్ కావాలి, కానీ అందులో ఉల్లిపాయ ఉండకూడదు. దానికి తోడు రెండు బ్రెడ్ స్లైసులు కావాలి. పరి అయితే ఏకంగా బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేసింది.

లంచ్ ఆర్డర్లు కూడా ఇలాగే ఉన్నాయి. కాశ్వికి బ్రౌన్ రైస్‌తో చికెన్, కూరగాయలు కావలసి ఉండగా, ఊర్వశికి వైట్ రైస్‌తో చికెన్, కూరగాయలు కావాలి. ఇషికాకు అవకాడో-ఎగ్ టోస్ట్స్, పరికి మూడు గుడ్ల ఆమ్లెట్, చీజ్ శాండ్‌విచ్‌లు ఆర్డర్ చేశారు. రాత్రి భోజనం కోసం కూడా స్లైస్డ్ చికెన్ సలాడ్, భిండి, రైతా, రోటీలంటూ ఒక్కొక్కరిదీ ఒక్కో మెనూ ఉంది.

ఇంత విభిన్నమైన వంటకాలను తమ ఇద్దరు వంట మనుషులు సులభంగానే చేస్తారని, ఈ ప్లానింగ్ కోసం ప్రతిరోజూ సాయంత్రం కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే పడుతుందని కాశ్వి తన పోస్ట్‌లో పేర్కొంది. ఒకే ఇంట్లో ఉంటూ, ఓ హోటల్ మెనూను తలపించేలా ఇంత పక్కాగా ప్లాన్ చేసుకోవడం అందరినీ ఆకట్టుకుంటోంది. యువతుల సమన్వయం, వంటవాళ్ల ఓపికను నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.
Advertisement
Kashvi Saxena
Bengaluru girls cooking menu
Viral WhatsApp group chat
Buddy Niwas Cooking
Personalized meal planning
Bengaluru flatmates viral story

More Telugu News