‘‘అందుకే మా రిలేషన్‌షిప్‌ను సీక్రెట్‌గా ఉంచాం’’.. ఆసక్తికర విషయాలను పంచుకున్న విజయ్‌-రష్మిక

‘‘అందుకే మా రిలేషన్‌షిప్‌ను సీక్రెట్‌గా ఉంచాం’’.. ఆసక్తికర విషయాలను పంచుకున్న విజయ్‌-రష్మిక

Vijay Deverakonda and Rashmika Mandanna on why they kept their relationship secret
  • రణబాలి ప్రమోషన్స్‌లో భాగంగా ఆసక్తికర విషయాలు వెల్లడించిన విజయ్‌-రష్మిక జంట
  • మొదట కోస్టార్స్‌గా.. ఆపై స్నేహంగా.. అది కాస్తా ప్రేమగా మారిందని వెల్లడి
  • తమ బంధం గురించి బయటి ప్రపంచానికి చెప్పాలని అనిపించలేదన్న విజయ్‌
  • తమ ప్రేమ మరొకరి వినోదం కోసమో, గాసిప్‌ కోసమో కాదని రష్మిక వ్యాఖ్య
  • జీవితంలో ప్రత్యేకమైన క్షణాలను తమతోనే ఉంచుకోవాలనుకున్నామని వివరణ
సెలబ్రిటీల ప్రేమకథల్లో ఏదో ఒక దశలో ‘ఎప్పుడు ప్రేమలో పడ్డారు?’, ‘ఎవరు ముందుగా ప్రపోజ్‌ చేశారు?’ అనే ప్రశ్నలు వస్తూనే ఉంటాయి. రష్మిక మందన్న, విజయ్‌ దేవరకొండ విషయంలో మాత్రం ఈ ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పడం కాస్త కష్టమే. ఎందుకంటే.. తమ బంధానికి వాళ్లు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన తేదీ పెట్టుకోలేదు. ప్రేమను ప్రకటించుకోలేదు. ప్రపోజ్‌ కూడా చేసుకోలేదు. అయినా ఒకరితో ఒకరు ఉంటూ.. తమ బంధం ఎప్పుడు ప్రేమగా మారిందో తెలియకుండానే పెళ్లి వరకు వచ్చేశారు.

2026 ఫిబ్రవరిలో రష్మిక, విజయ్‌ పెళ్లి చేసుకున్నారు. అప్పటివరకు వీరిద్దరి గురించి ఎన్నో వార్తలు వచ్చినా.. తమ వ్యక్తిగత జీవితంపై మాత్రం ఇద్దరూ పెద్దగా మాట్లాడలేదు. తాజాగా ‘రణబాలి’ ప్రమోషన్లలో భాగంగా శుభంకర్‌ మిశ్రా పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఈ జంట.. చాలాకాలం తమ రిలేషన్‌షిప్‌ను ఎందుకు ప్రైవేట్‌గా ఉంచారో చెప్పారు.

కోస్టార్‌గా మొదలై.. జీవిత భాగస్వామిగా
విజయ్‌ మాటల్లో చెప్పాలంటే.. రష్మికతో తన పరిచయం తొలుత ప్రేమతో మొదలవలేదు. ఇద్దరూ కలిసి పనిచేసే కోస్టార్స్‌ అంతే. ఆ పరిచయం కాస్తా స్నేహంగా మారింది. అది పెరిగేకొద్దీ ఒకరంటే ఒకరికి ఇష్టం పెరిగింది. చివరికి అదే బంధం పెళ్లి వరకు వెళ్లింది.

అయితే ఈ మొత్తం ప్రయాణాన్ని తాము దాచిపెట్టేందుకు ఎప్పుడూ ప్రయత్నించలేదని విజయ్‌ చెప్పాడు. బయట ప్రపంచానికి తమ బంధం గురించి చెప్పాలనే అవసరం మాత్రం తనకు అనిపించలేదన్నాడు. తన వ్యక్తిగత జీవితం గురించి అందరికీ చెప్పాల్సిన బాధ్యత తనపై లేదనే భావనతోనే ఉన్నానని విజయ్‌ స్పష్టం చేశాడు.

‘మా బంధం.. మా కోసమే’
రష్మిక కూడా ఇదే విషయాన్ని మరో కోణంలో చెప్పింది. తమ రిలేషన్‌షిప్‌ ఎవరి వినోదం కోసమో లేదంటే గాసిప్‌ కోసమో కాదని పేర్కొంది. “మన జీవితంలో కొన్ని విషయాలు మనకు చాలా ప్రత్యేకమైనవి. వాటిని మన దగ్గరే ఉంచుకోవాలనుకుంటాం” అనే భావనతోనే తమ బంధాన్ని ప్రైవేట్‌గా ఉంచుకున్నామని రష్మిక వివరించింది.

పెళ్లి ఆలోచన ఎప్పుడు వచ్చిందంటే..
అయితే విజయ్‌కు పెళ్లి ఆలోచన ఒక్కరోజులో రాలేదు. పెళ్లికి ఏడాది ముందు తన జీవితంలో రష్మిక ఎంత ముఖ్యమైపోయిందో తనకే అర్థమైందని అతడు చెప్పాడు. ఆమెతో కలిసి ఏ పని చేసినా తనకు మరింత ఆనందంగా అనిపించేదట. కలిసి పని చేయడం, ట్రైనింగ్‌కు వెళ్లడం.. చివరకు కలిసి భోజనం చేయడం కూడా ప్రత్యేకంగానే అనిపించేదని విజయ్‌ చెప్పాడు.

ఒంటరిగా తింటున్నప్పుడు కూడా ‘రష్మిక ఇక్కడ ఉంటే బాగుండేది’ అనే ఆలోచన వచ్చేదట. తన రోజువారీ జీవితంలో చిన్న చిన్న సందర్భాల్లోనూ ఆమెను మిస్‌ అవుతున్నానని విజయ్‌ గుర్తించాడట. అప్పుడు తనకు అసలు విషయం అర్థమైందని.. జీవితంలో ప్రతి చిన్న ఆనందాన్ని రష్మికతో పంచుకుంటేనే మరింత బాగుంటుందని తెలిసొచ్చిందని చెప్పుకొచ్చాడు. అక్కడి నుంచే పెళ్లి ఆలోచన బలపడిందని వివరించాడు.

‘మనం ఒకరితో ఒకరం ఉంటేనే బాగుంటాం’
రష్మికకు కూడా తమ బంధం గురించి ఇదే తరహా అనుభూతి కలిగిందట. ఒకరినొకరు మూడు, నాలుగేళ్లు తెలుసుకున్న తర్వాత తమ మధ్య ఉన్న అనుబంధం మిగతా స్నేహాలకు భిన్నమైందని ఆమెకు అర్థమైందట. ఇద్దరూ కలిసి ఉన్నప్పుడు తమ జీవితాలు మరింత సంపూర్ణంగా అనిపించేవని రష్మిక చెప్పింది. అయితే ‘ఈ రోజే ప్రేమలో పడ్డాం’ అని చెప్పేలా ఒక ప్రత్యేకమైన క్షణం అంటూ తమ కథలో లేదని తెలిపింది.

ప్రపోజ్‌ లేదు..
చాలా ప్రేమకథల్లో ఒకరు మోకాళ్లపై కూర్చొని ప్రపోజ్‌ చేయడం.. ఎదుటివారు ఓకే చెప్పడం ఉంటుంది. రష్మిక-విజయ్‌ కథలో మాత్రం అలాంటిదేమీ జరగలేదట. ఇద్దరూ ఒకరికొకరు ప్రత్యేకంగా ప్రేమను వ్యక్తపర్చుకోలేదని విజయ్‌ చెప్పాడు. ఎప్పుడు స్నేహం ప్రేమగా మారిందో కూడా ఇద్దరికీ కచ్చితంగా గుర్తులేదట. కానీ కలిసి గడిపిన ప్రతి రోజుతో ఆ అనుబంధం మరింత బలపడిందని చెప్పాడు. ఒకరంటే ఒకరికి ఇష్టం పెరిగిందని తెలిపారు. చివరికి అదే ప్రేమ జీవితాంతం కలిసి ఉండాలనే నిర్ణయానికి తీసుకెళ్లిందని వివరించారు.
Advertisement
Vijay Deverakonda
Rashmika Mandanna
Vijay Rashmika marriage
Shubhankar Mishra podcast
Tollywood celebrity news
Vijay Rashmika relationship

More Telugu News