హిందీ నేర్చుకోవాలంటూ ఉద్యోగులపై బెంగళూరు జొమాటో సూపర్వైజర్ ఒత్తిడి.. చివరకు క్షమాపణ

హిందీ నేర్చుకోవాలంటూ ఉద్యోగులపై బెంగళూరు జొమాటో సూపర్వైజర్ ఒత్తిడి.. చివరకు క్షమాపణ

Zomato supervisor in Bengaluru pressures employees to learn Hindi and finally apologizes
  • హిందీ నేర్చుకోండి, లేదంటే వెళ్ళిపోండి అన్న జొమాటో సూపర్వైజర్
  • వీడియో వైరల్ కావడంతో కన్నడ సంఘాల తీవ్ర నిరసన
  • బాధ్యులపై చర్యలు తీసుకుంటామని జొమాటో హామీ
జొమాటో వేర్‌హౌస్‌లో పనిచేసే స్థానిక ఉద్యోగులు హిందీ నేర్చుకోవాలని, లేదంటే ఉద్యోగం మానేయాలని హుకుం జారీ చేసిన ఓ సూపర్వైజర్, తీవ్ర వివాదం చెలరేగడంతో చివరకు క్షమాపణ చెప్పాడు. బెంగళూరులోని మకాలి సమీపంలో ఉన్న జొమాటో గోదాములో ఈ ఘటన జరిగింది. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కన్నడ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.

వివరాల్లోకి వెళితే, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అశోక్ అనే వ్యక్తి జొమాటో వేర్‌హౌస్‌లో సూపర్వైజర్‌గా పనిచేస్తున్నాడు. "నాకు కన్నడ రాదు, నేను హిందీలోనే మాట్లాడతాను. ఇక్కడ పనిచేయాలంటే మీరు హిందీ నేర్చుకోవాల్సిందే. లేదంటే ఉద్యోగం మానేసి వెళ్లిపోండి" అని ఉద్యోగులతో అతను చెప్పిన మాటలు వీడియోలో రికార్డ్ అయ్యాయి. ఇది కర్ణాటక అని ఓ ఉద్యోగి గుర్తుచేయగా... అయితే ఏంటి? అని అతను బదులిచ్చాడు.

ఈ వీడియో బయటకు రావడంతో కన్నడ సంఘాలు వేర్‌హౌస్ వద్దకు చేరుకుని నిరసన చేపట్టాయి. సూపర్వైజర్‌ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశాయి. దీనిపై మదనాయకనహళ్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా నమోదైంది. దీంతో పోలీసులు అశోక్‌ను కాసేపు అదుపులోకి తీసుకుని, పరిస్థితిని చక్కదిద్దారు. నిరసనకారులతో మాట్లాడిన జొమాటో యాజమాన్యం, సదరు సూపర్వైజర్‌ను విధుల నుంచి తొలగిస్తామని హామీ ఇచ్చింది.

విమర్శలు వెల్లువెత్తడంతో అశోక్, కన్నడలో చేతులు జోడించి క్షమాపణ చెబుతూ మరో వీడియో విడుదల చేశాడు. తాను మాట్లాడిన మాటలు తప్పేనని, భవిష్యత్తులో ఇలాంటి పొరపాటు చేయనని పేర్కొన్నాడు. ఈ ఘటనతో కర్ణాటకలోని కార్యాలయాల్లో భాషా సున్నితత్వంపై మరోసారి చర్చకు దారితీసింది.

Advertisement
Zomato
Bengaluru
Hindi imposition
Supervisor Ashok
Karnataka language row
Zomato warehouse

More Telugu News