వరల్డ్ కప్ అందించిన కెప్టెన్ సంచలన నిర్ణయం.. అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీకి హర్మన్‌ప్రీత్ గుడ్‌బై!

వరల్డ్ కప్ అందించిన కెప్టెన్ సంచలన నిర్ణయం.. అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీకి హర్మన్‌ప్రీత్ గుడ్‌బై!

Harmanpreet Kaur steps down from captaincy across all formats
  • భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్న హర్మన్‌ప్రీత్ కౌర్
  • అన్ని ఫార్మాట్లలో సారథ్య బాధ్యతలకు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటన
  • 2025లో భారత్‌కు వన్డే ప్రపంచకప్ అందించిన ఘనత
  • జట్టు ఇప్పుడు పటిష్ఠంగా ఉందని, అందుకే ఈ నిర్ణయమని వెల్లడి
  • ప్లేయర్‌గా మాత్రం కొనసాగుతానని స్పష్టం చేసిన హర్మన్‌ప్రీత్
భారత మహిళా క్రికెట్ జట్టులో ఒక శకం ముగిసింది. జట్టును విజయపథంలో నడిపించిన సక్సెస్‌ఫుల్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, తన సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేసింది. ఇవాళ‌ ఆమె అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీకి వీడ్కోలు పలుకుతున్నట్లు వెల్లడించింది. 

ఇటీవలే ముగిసిన ఆసియా క్రీడలు 2026లో భారత జట్టుకు వరుసగా రెండోసారి స్వర్ణ పతకాన్ని అందించిన కొద్ది రోజులకే ఈ నిర్ణయం తీసుకోవడం క్రీడా వర్గాలను ఆశ్చర్యపరిచింది.

ఈ సందర్భంగా హర్మన్‌ప్రీత్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక సుదీర్ఘమైన, భావోద్వేగభరితమైన పోస్ట్ చేసింది. "కెప్టెన్సీ నుంచి వైదొలగాలన్న నిర్ణయం అంత సులభం కాదు. ఎన్నో ఏళ్ల జ్ఞాపకాలు, త్యాగాలు, జట్టు ఎదుగుదల కోసం తీసుకున్న కఠిన నిర్ణయాల సమాహారం ఈ ప్రయాణం. 

ఈ రోజు కెప్టెన్సీని వీడుతున్నప్పుడు నా హృదయం భావోద్వేగాలతో నిండి ఉంది, కానీ అదే సమయంలో మనసు ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే నా జట్టు ఇప్పుడు చాలా మంచి స్థితిలో ఉందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను" అని హర్మన్‌ప్రీత్ పేర్కొంది. 

తాను ఒక సాధారణ ప్లేయర్‌గా జట్టులో కొనసాగుతానని స్పష్టం చేసింది. ఈ ప్రయాణంలో తనకు అండగా నిలిచిన సహచర క్రీడాకారిణులకు, కోచ్‌లకు, సహాయక సిబ్బందికి, బీసీసీఐకి, తన కుటుంబ సభ్యులకు, అభిమానులకు ఆమె కృతజ్ఞతలు తెలిపింది.

కౌర్ కెప్టెన్సీలో భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయాలు 
హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయాలు సాధించింది. 2025లో జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్‌ను గెలిచి భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. అయితే, కొంతకాలంగా జట్టులో నాయకత్వ మార్పుపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

వైస్ కెప్టెన్ స్మృతి మంధాన తదుపరి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే, కొత్త కెప్టెన్‌పై బీసీసీఐ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. హర్మన్‌ప్రీత్ కౌర్ నిష్క్రమణతో భారత మహిళా క్రికెట్‌లో ఒక విజయవంతమైన అధ్యాయం ముగిసినట్లయింది.
Advertisement
Harmanpreet Kaur
Indian Women Cricket Team
Captaincy Resignation
Smriti Mandhana
BCCI
Womens World Cup

More Telugu News