‘ధైర్యమున్న మగాడివైతే విజయ్‌తో తేల్చుకో.. త్రిష జోలికొస్తే ఊరుకోం!’: ఉదయనిధిపై ఖుష్బూ ఫైర్

Khushbu Sundar fires at Udhayanidhi Stalin and tells him to settle issues with Vijay
  • నటి త్రిషపై ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యల దుమారం
  • ఉదయనిధిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన బీజేపీ నేత ఖుష్బూ
  • మహిళలను అవమానించడం డీఎంకే సంస్కృతి అని విమర్శ
  • త్రిషకు ఉదయనిధి క్షమాపణ చెప్పాలని డిమాండ్
నటి త్రిషను ఉద్దేశించి డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఉదయనిధి స్టాలిన్ చేసిన ద్వంద్వార్థ వ్యాఖ్యల వివాదం తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నాయకురాలు, నటి ఖుష్బూ సుందర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దమ్ముంటే ముఖ్యమంత్రి విజయ్‌తో నేరుగా రాజకీయ పోరాటం చేయాలని, అనవసరంగా మహిళలను ఇందులోకి లాగవద్దని ఉదయనిధికి ఘాటుగా హెచ్చరించారు.

మీడియాతో మాట్లాడిన ఖుష్బూ.. "రాజకీయాల్లో విభేదాలు సహజం. నీకు సీఎం విజయ్‌తో సమస్య ఉంటే ఆయనతోనే తేల్చుకో. మగాడివైతే త్యాగరాజనగర్‌లో విజయ్‌తో తలపడు. అంతేకానీ, ఏ సంబంధం లేని నటి త్రిషను రాజకీయాల్లోకి లాగి అసభ్యంగా మాట్లాడటం నీచమైన మనస్తత్వానికి నిదర్శనం" అని విరుచుకుపడ్డారు. మహిళలను గౌరవించడం డీఎంకే సంస్కృతిలోనే లేదని, వారి రక్తంలోనే మహిళలను అవమానించే గుణం ఉందని ఆమె ఆరోపించారు.

"గతంలో అసెంబ్లీలో జయలలితను, ఆ తర్వాత శశికళను డీఎంకే నేతలు అవమానించారు. ఇప్పుడు త్రిషపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. మహిళల పట్ల డీఎంకే నేతల చౌకబారు ఆలోచనలకు ఇదే నిదర్శనం. ఉదయనిధి వెంటనే త్రిషకు బహిరంగ క్షమాపణ చెప్పాలి" అని ఖుష్బూ డిమాండ్ చేశారు.

కావేరి జలాల కోసం జరిగిన నిరసన ప్రదర్శనలో సీఎం విజయ్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ఉదయనిధి.. త్రిష పేరును ప్రస్తావిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదులు అందగా, పోలీసులు కేసు నమోదు చేసి ఉదయనిధిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత హైకోర్టు ఆదేశాలతో ఆయన స్టేషన్ బెయిల్‌పై విడుదలయ్యారు. ఖుష్బూతో పాటు పలువురు మహిళా నేతలు, సినీ ప్రముఖులు కూడా ఈ వ్యాఖ్యలను ఖండిస్తుండటంతో ఈ వివాదం డీఎంకేకు రాజకీయంగా తలనొప్పిగా మారింది.
Advertisement
Khushbu Sundar
Udhayanidhi Stalin
Trisha Krishnan
Thalapathy Vijay
Tamil Nadu Politics
DMK vs BJP

More Telugu News