హైదరాబాద్ కు భారీ వర్ష సూచన.. ఎల్లో అలర్ట్ జారీ
- వాయుగుండం కారణంగా తెలంగాణలో భారీ వర్షాలు
- హైదరాబాద్ లో నేడు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం
- వాహనదారులు, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్న అధికారులు
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా తెలంగాణలో వర్షాలు విరామం లేకుండా కురుస్తున్నాయి. వీటి ప్రభావంతో నేడు హైదరాబాద్ నగరం వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు నగర ప్రజలను అప్రమత్తం చేస్తూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా ఆకాశం రోజంతా మేఘావృతమై ఉంటుందని, పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. నిన్న హైదరాబాద్‌తో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కుండపోత వర్షం ముంచెత్తింది. గడిచిన 24 గంటల్లో కామారెడ్డి జిల్లాలో అత్యధికంగా 18.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా... వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లోనూ భారీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. రోడ్లపైకి వస్తున్న వాహనదారులు, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.