మహిళను వివస్త్రను చేసి దాడికి పాల్పడిన ఘటన మానవత్వానికే మచ్చ: జగన్ 

YS Jagan Mohan Reddy Slams Chandrababu Naidu Over Guntur Woman Attack
  • గుంటూరులో మహిళపై టీడీపీ నేత దాడి ఘటనపై జగన్ ఆగ్రహం
  • బుధవారం ఘటన జరిగితే మూడు రోజులు కప్పిపుచ్చారని ఆరోపణ
  • ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించలేదని తీవ్ర విమర్శలు
  • ఇదేనా సుపరిపాలన, మహిళా భద్రత అంటూ సర్కారుకు ప్రశ్నలు
  • మహిళల ఆగ్రహం ప్రభుత్వానికి బుద్ధి చెబుతుందని హెచ్చరిక
గుంటూరులో ఒక మహిళను వివస్త్రను చేసి, టీడీపీ నాయకుడు దాడికి పాల్పడిన ఘటన మానవత్వానికే మచ్చ అని, రాష్ట్రంలో శాంతిభద్రతల నిర్వహణ ఎంత ఘోరంగా విఫలమైందో చెప్పడానికి ఇది నిలువెత్తు నిదర్శనమని వైసీపీ అధినేత జగన్ మండిపడ్డారు. ఈ దారుణానికి చంద్రబాబు ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలని ఆయన విమర్శించారు.

ఈ ఘటన బుధవారమే జరిగినా, మూడు రోజులపాటు దానిని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారని, చివరకు ఆ వీడియోలు సోషల్‌ మీడియాలో బయటకు వచ్చి రాష్ట్ర ప్రజలంతా ఈ పరిపాలనను అసహ్యించుకున్న తర్వాతే ప్రభుత్వం స్పందించిందని ఆయన ధ్వజమెత్తారు. ఇప్పుడు తానేదో గొప్పగా చర్యలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు హడావుడి చేయడం మరింత సిగ్గుచేటని అన్నారు.

ఆ వీడియోలను కప్పిపుచ్చడంపై చూపిన శ్రద్ధను నిందితులను పట్టుకోవడంపై చూపలేదని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం తనపై తొలిసారి దాడి జరిగిన వెంటనే బాధితురాలు పోలీసులను ఆశ్రయించినప్పుడు వారు స్పందించి ఉంటే, ఆ తర్వాత ఇంతటి ఘోరం జరిగేది కాదు కదా అని ప్రశ్నించారు. ఆమె ఫిర్యాదుపై వెంటనే కేసు నమోదు చేసి, నిందితులను అదుపులోకి తీసుకుని ఉంటే ఈ దారుణం జరిగేదా? అని నిలదీశారు. ఫిర్యాదు చేసిన మహిళకు రక్షణ కల్పించకుండా మౌనం వహించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు.

"అసలు పోలీస్‌ స్టేషన్లు ఉన్నది ఎందుకు? బాధితుల ఫిర్యాదులను స్వీకరించడానికా? లేక అధికార పార్టీ నాయకులు ఏం చెబితే అది చేయడానికా? బాధితురాలికి అండగా నిలవకపోగా, పంచాయితీలు చేయడానికి ప్రయత్నిస్తారా? వీడియోలు బయటకు వస్తేనే చట్టం మేల్కొంటుందా? బాధితురాలి ఫిర్యాదుకు విలువ లేదా? నేరం జరుగుతున్నప్పుడు స్పందించకుండా, ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికిన తర్వాత చర్యల పేరుతో నాటకాలు ఆడటం ఏ రకమైన పోలీసింగ్‌? రెడ్‌బుక్‌ రాజ్యాంగం పేరుతో ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలు, సోషల్‌ మీడియా యాక్టివిస్టులపై ఈ చంద్రబాబు ప్రభుత్వం కావాలనే దాడులను ప్రోత్సహించింది. ఆ అరాచకాలను కప్పిపుచ్చడానికి పోలీసు వ్యవస్థను ఒక రాజకీయ ఆయుధంగా మార్చుకుంది. చట్టాన్ని అధికార పార్టీకి చుట్టంగా, ప్రతిపక్షాలపై వేధింపులకు, అక్రమ కేసులకు ఒక సాధనంగా మార్చి రాష్ట్రాన్ని జంగిల్‌రాజ్‌గా దిగజార్చింది" అని ఆయన తీవ్రంగా విమర్శించారు.

అధికార పార్టీ నాయకులు ఏం చేసినా పోలీసులు రక్షిస్తారనే ధైర్యం ఈ రెడ్‌బుక్‌పాలనలో గ్రామాలు, వార్డుల స్థాయి వరకూ పాకిందని జగన్ అన్నారు. అందుకే టీడీపీ కూటమికి చెందిన పలువురు నాయకులు దుశ్శాసనుల్లా తయారయ్యారని మండిపడ్డారు. ఎలాంటి దారుణాలు చేసినా, ముఖ్యంగా మహిళలపై దాడి చేసినా, తమను కాపాడటానికి చంద్రబాబు ఉన్నారనే ధైర్యం వారిలో పెరిగిపోయిందని ధ్వజమెత్తారు.

ఈ పరిస్థితి రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా చేసిందని జగన్ ఆరోపించారు. అధికార పార్టీ నాయకుల దురాగతాల నుంచి తమను తాము కాపాడుకోవాల్సిన దుస్థితికి మహిళల చేరుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. "చంద్రబాబు గారూ, ఇదేనా మీరు చెప్పే మహిళా భద్రత? ఇదేనా మీ సుపరిపాలన? ఇదేనా మీ పోలీసింగ్‌? మహిళల ఆగ్రహమే మీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతుంది" అని  ఆయన హెచ్చరించారు.
Advertisement
YS Jagan Mohan Reddy
Chandrababu Naidu
Guntur Woman Attack
TDP Leader Assault
Andhra Pradesh Law and Order

More Telugu News