పంచదార్ల కొండను మింగేస్తున్నారు.. పవన్ కల్యాణ్ ఏం ప్రాయశ్చిత్తం చేస్తారు?: కూటమి నేతలపై వైసీపీ ధ్వజం
- పంచదార్ల కొండపై అక్రమ మైనింగ్ చేస్తున్నారన్న గుడివాడ అమర్నాథ్
- వందల లారీల గ్రావెల్ తరలిస్తూ కొండను పిండి చేస్తున్నారని మండిపాటు
- సొంత కంపెనీల పేరుతో పర్మిట్లు తెచ్చుకుని కొండలను మాయం చేస్తున్నారన్న కన్నబాబు
అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గ పరిధిలోని చారిత్రాత్మక పంచదార్ల కొండపై జరుగుతున్న అక్రమ మైనింగ్‌కు వ్యతిరేకంగా స్థానిక గ్రామస్తులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని వైసీపీ మాజీ మంత్రులు గుడివాడ అమర్నాథ్, కురసాల కన్నబాబు, దాడిశెట్టి రాజా, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, బొడ్డేడ ప్రసాద్ తదితరులు సందర్శించి తమ సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా కూటమి నేతల తీరుపై వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
కూటమి ప్రభుత్వ హయాంలో దోపిడీకి హద్దు అదుపు లేకుండా పోతోందని గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. స్థానిక ఎంపీ సీఎం రమేశ్ అనకాపల్లి జిల్లాలో పంచభూతాలను దోచేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. వందల లారీల గ్రావెల్ తరలిస్తూ కొండలను పిండి చేస్తున్నారని, 1200 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన పవిత్రమైన పంచదార్ల కొండను సైతం మింగేస్తూ మహా పాపానికి ఒడిగడుతున్నారని ధ్వజమెత్తారు. నిత్యం సనాతన ధర్మం గురించి మాట్లాడే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇక్కడ జరుగుతున్న విధ్వంసంపై ఎందుకు నోరు విప్పడం లేదని, ఈ పాపానికి ఆయన ఏం ప్రాయశ్చిత్తం చేసుకుంటారని నిలదీశారు.
'దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు' కూటమి నేతలు దోపిడీకి పాల్పడుతున్నారని మాజీ మంత్రి కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప నుంచి వచ్చిన సీఎం రమేశ్ ఇక్కడ ప్రజాసేవ చేస్తారనుకుంటే... తన సొంత కంపెనీల పేరుతో పర్మిట్లు తెచ్చుకుని కొండలను మాయం చేస్తూ పర్యావరణాన్ని దారుణంగా దెబ్బతీస్తున్నారని విమర్శించారు. తెల్లవారితే సనాతన ధర్మం అనే వాళ్లు ఉమా ధర్మలింగేశ్వర స్వామి ఆలయానికే గుండు కొడుతున్నారని ఆరోపించారు. ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని తమ అధినేత జగన్ దృష్టికి తీసుకెళ్తామని, ఈ నెల 21న 'చలో పంచదార్ల' కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ప్రకటించారు. రాబోయే సోమవారంలోపు మైనింగ్ లీజులను రద్దు చేసి, 30 కిలోమీటర్ల పరిధిలోని ఈ కొండలను 'నో మైనింగ్ జోన్'గా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
మహాభారతంలో ప్రస్తావన ఉన్న, చోళుల కాలం నాటి ఉమా ధర్మలింగేశ్వర స్వామి ఆలయం వెలసిన ఈ పంచదార్ల కొండలు అత్యంత పవిత్రమైనవని దాడిశెట్టి రాజా గుర్తుచేశారు. సంపద సృష్టి అనే సాకుతో ఎక్కడి నుంచో వచ్చి ఉత్తరాంధ్ర వారసత్వ సంపదను దోచుకుంటుంటే ఇక్కడి సనాతనవాదులకు ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ... పంచదార్ల కొండలపై కూటమి అనే అనకొండలు పడ్డాయని ఎద్దేవా చేశారు. ఎంపీ సీఎం రమేశ్, ఎమ్మెల్యే సుందరపు కుమార్ ఇద్దరూ గద్దల్లా కొండలను దోచుకుంటున్నారని, ప్రజలకు జీవనాధారమైన ఈ కొండల అక్రమ మైనింగ్‌పై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.