రూ. 10 వేల లంచం కోసం మహిళను వివస్త్రను చేశారు: వరుదు కల్యాణి
- కూటమి పాలనలో సమాజం తలదించుకునే పరిస్థితి వచ్చిందన్న వరుదు కల్యాణి
- రాష్ట్రంలో రక్షణ కరువైందని మండిపాటు
- ప్రజలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్
గుంటూరు జిల్లాలో మహిళ పట్ల జరిగిన అమానుష ఘటనపై వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి పాలనలో సభ్య సమాజం తలదించుకునే పరిస్థితులు వచ్చాయని, అధికార పార్టీ నాయకులు కాలకేయుల్లా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరవైందని, వారు స్వేచ్ఛగా బతికే వాతావరణం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు
ఒక సాధారణ నీటి కుళాయి కనెక్షన్ కోసం మల్లెల మూర్తి అనే వ్యక్తి సదరు మహిళను రూ. 10 వేల లంచం అడిగాడని వరుదు కల్యాణి ఆరోపించారు. ఆ సమయంలో తలెత్తిన ఘర్షణ కారణంగానే ఆ మహిళను వివస్త్రను చేసి అమానుషంగా దాడికి తెగబడ్డారని పేర్కొన్నారు. ఈ దారుణంపై బాధితురాలు పోలీసులను ఆశ్రయించినా తొలుత వారు పట్టించుకోలేదని, ఈ వైఫల్యానికి కూటమి ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ అనాగరిక చర్యకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నిందితుడు మల్లెల మూర్తి అధికార పార్టీకి చెందిన వ్యక్తి కాబట్టే... తప్పు కప్పిపుచ్చుకోవడానికి కేవలం సస్పెన్షన్ వేటు వేసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. అధికార దుర్వినియోగానికి గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి పేటెంట్ అని ఎద్దేవా చేశారు.