రాష్ట్రంలో గుడిసెలు లేకుండా చేస్తాం: కోమటిరెడ్డి వెంకటరెడ్డి
- ప్రతి పేద కుటుంబానికి పక్కా ఇల్లు అందిస్తామన్న కోమటిరెడ్డి
- ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగుతోందని వ్యాఖ్య
- పేదలకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామన్న మంత్రి
తెలంగాణ రాష్ట్రంలో గుడిసెలు అనేవే లేకుండా చేస్తామని, అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి సొంత పక్కా ఇల్లు అందిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగుతోందని ఆయన కొనియాడారు. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో రూ.184.15 కోట్ల భారీ వ్యయంతో చేపట్టనున్న రోడ్ల అభివృద్ధి పనులకు మంత్రులు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పరిగి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రులు కీలక వివరాలను వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇళ్లు లేని పేద ప్రజలు సొంతంగా పక్కా ఇంటిని నిర్మించుకునేందుకు ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తోందని కోమటిరెడ్డి తెలిపారు. త్వరలోనే అర్హులైన మిగతా వారందరికీ ఇళ్లు ఇచ్చేందుకు రెండో విడత కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తామన్నారు. వికారాబాద్ జిల్లాలో రోడ్ల నెట్‌వర్క్ బలోపేతం కోసం రూ.900 కోట్ల నిధులు మంజూరు చేయించామని, అందులో నుంచే పరిగి నియోజకవర్గానికి రూ.184.15 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. రవాణా వ్యవస్థ మెరుగైతేనే పరిశ్రమలు వచ్చి స్థానిక యువతకు ఉపాధి పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి తీరుతామని మాట ఇచ్చిన మంత్రి కోమటిరెడ్డి... నిరుపేదలకు కొత్త రేషన్ కార్డులతో పాటు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని గుర్తుచేశారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500లకే గ్యాస్ సిలిండర్ వంటి సంక్షేమ పథకాలను విజయవంతంగా కొనసాగిస్తున్నామని వివరించారు.