గోదావరిలో గల్లంతైన ఐదుగురూ మృతి.. చంద్రబాబు, పవన్ దిగ్భ్రాంతి

Five people missing in Godavari found dead Chandrababu and Pawan express shock
  • పోలవరం జిల్లా ఎటపాక మండలంలో విషాదకర ఘటన
  • గోదావరిన నీటి ప్రవాహానికి కొట్టుకుపోయిన గిరిజనులు
  • బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్న చంద్రబాబు
  • ఈ ఉదంతం కలచివేసిందన్న పవన్

పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగూడెం వద్ద గోదావరి నదిలో చేపల వేటకు వెళ్లి ఐదుగురు స్థానికులు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఒకే గ్రామానికి చెందిన ఐదుగురు ఇలా మృత్యువాత పడటం అత్యంత విచారకరమని, బాధిత కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.


ఈ ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే చంద్రబాబు అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గొమ్ముకొత్తగూడెం గ్రామానికి చెందిన తుర్రం భారతి, ఊకే సుశీల, ఊకే లక్ష్మి, బాసిబోయిన బాలరాజు, ఊకే రమేశ్ అనే ఐదుగురు ఈ దుర్ఘటనలో మరణించినట్లు అధికారులు సీఎంకు తెలిపారు. బాధిత కుటుంబాలకు తక్షణమే అవసరమైన ఆర్థిక, నిత్యావసర సహాయ సహకారాలు అందించాలని జిల్లా యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి ఆదేశించారు.


ఈ దారుణ ఉదంతం తనను తీవ్రంగా కలిచివేసిందనిపవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఆయన పోలవరం జిల్లా కలెక్టర్‌కు ఫోన్ చేసి, ఘటనకు దారితీసిన పరిస్థితులపై ఆరా తీశారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ.. ప్రభుత్వం తరఫున వారికి ఎలాంటి లోటు రాకుండా సహాయ చర్యలు ముమ్మరం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.


ఈ ప్రమాదంపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలతో ఆమె ఫోన్‌లో మాట్లాడి సహాయక చర్యలను పర్యవేక్షించారు. సాధారణంగా చేపల వేటకు వెళ్లే ప్రాంతంలో ఈ ప్రమాదం ఎలా జరిగిందనే కోణంలో సమగ్ర దర్యాప్తు జరపాలని పోలీసు అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు తక్షణ ప్రభుత్వ సాయం అందేలా చూడాలని జిల్లా యంత్రాంగానికి స్పష్టం చేస్తూ... మృతుల కుటుంబ సభ్యులకు ఈ కష్ట సమయంలో భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆమె ఆకాంక్షించారు.

Advertisement
Chandrababu Naidu
Pawan Kalyan
Godavari River drowning
Etapaka Gollagudem mishap
Andhra Pradesh news
Vangalapudi Anitha

More Telugu News