ఎంత బెస్ట్‌ ఫ్రెండ్ అయినా ఈ విషయాలు చెప్పొద్దంటున్న నిపుణులు!

Friendship Tips For Maintaining Personal Privacy And Security
  • పాస్‌వర్డ్‌లు, బ్యాంక్‌ వివరాలు పంచుకోవద్దు
  • చిన్న చిన్న దాంపత్య గొడవలు బయటపెట్టొద్దు
  • ఇతరులు చెప్పిన రహస్యాలు దాచాలి
  • ఖరారు కాని ప్రణాళికలు ముందే చెప్పొద్దు
  • అతిగా ఆత్మనింద చేసుకోవడం మానాలి
  • నమ్మకం, గోప్యత ఉంటేనే స్నేహానికి బలం
బెస్ట్‌ ఫ్రెండ్‌ అంటే మనసులో ఉన్నది చెప్పుకునే వ్యక్తే. కష్టాల్లో తోడుగా నిలిచే మనిషి కూడా. అలాంటి స్నేహంలో నమ్మకం ఉండటం సహజం. కానీ నమ్మకం ఉందని జీవితంలోని ప్రతి విషయాన్నీ చెప్పేయాల్సిన అవసరం లేదు. కొన్ని విషయాలు మన దగ్గర ఉంటేనే స్నేహం కూడా బలంగా ఉంటుంది. మన ప్రశాంతత కూడా ఉంటుంది. అందుకే ఎంత సన్నిహితుడైనా చెప్పకూడని కొన్ని విషయాలేంటో చూద్దాం..

పిన్‌, పాస్‌వర్డ్స్‌
ఫోన్‌ పిన్‌, ఈమెయిల్‌ పాస్‌వర్డ్‌, యూపీఐ, బ్యాంక్‌ వివరాలు.. ఇవన్నీ వ్యక్తిగత సమాచారం. ఎంత మంచి స్నేహితుడైనా అలాంటి వివరాలు చెప్పాల్సిన పని లేదు. ‘ఒకసారి వాడుకో’ అంటూ మొదలైన చిన్న విషయం కూడా తర్వాత ఇబ్బందిగా మారొచ్చు. నమ్మకం ఉండటం ఒకటి. వ్యక్తిగత భద్రత మరోటి. ఇంటికి తాళం వేసుకున్నట్టే ఈ వివరాలకూ రక్షణ ఉండాలి.

ప్రతి గొడవ
భార్యాభర్తల మధ్య అయినా, ప్రేమికుల మధ్య అయినా చిన్న చిన్న గొడవలు జరుగుతూనే ఉంటాయి. అలాంటి ప్రతిసారి వెంటనే బెస్ట్‌ ఫ్రెండ్‌కు ఫోన్‌ చేసి జరిగినదంతా చెప్పేయడం మంచిది కాదు. మరుసటి రోజు మీరు కలిసిపోయినా మీ స్నేహితుడి మనసులో మాత్రం ఆ చెడు అభిప్రాయం అలాగే ఉండిపోవచ్చు. అయితే వేధింపులు, మోసం, మానసికంగా ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉంటే మాత్రం మౌనంగా ఉండొద్దు.

ఇతరుల రహస్యం
కుటుంబంలో ఎవరో ఒకరు మనల్ని బాగా నమ్మి ఒక విషయం చెప్పి ఉండొచ్చు. అలాంటివి బెస్ట్‌ ఫ్రెండ్‌కు చెప్పేయొద్దు. మిమ్మల్ని నమ్మి చెప్పిన విషయాన్ని అదే నమ్మకంతో దాచుకోవాలి. అదే నిజమైన విశ్వాసానికి గుర్తు.

ఇవి ముందే చెప్పేయకండి
కొత్త ఉద్యోగానికి ప్రయత్నించడం, ఉద్యోగం వదిలేయాలని అనుకోవడం, విదేశాలకు వెళ్లాలని ప్లాన్‌ చేసుకోవడం.. ఇలాంటి విషయాలు ఇంకా ఖరారు కాకముందే అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఒకసారి బయటకు చెప్పాక ప్రశ్నలు మొదలవుతాయి. చివరకు అనుకున్నట్టు జరగకపోతే మళ్లీ అదే విషయంపై సమాధానాలు చెప్పాల్సి వస్తుంది. పని పూర్తయ్యాక చెప్పే ఆనందం వేరు.

మీ లోపాల గురించి అతిగా చెప్పొద్దు
ఒక్కోసారి మనం మనకే నచ్చము. జీవితంలో వెనుకబడ్డామేమో అనిపిస్తుంది. అలాంటి సమయంలో మనసులోని బాధను స్నేహితుడితో పంచుకోవడంలో తప్పు లేదు. కానీ ప్రతి మాటలోనూ మనలోని లోపాల గురించే మాట్లాడటం మంచిది కాదు. అదే అలవాటైతే ఆ ఆలోచనలే నిజమని మనసు నమ్మడం మొదలుపెడుతుంది. కష్టాలను చెప్పాలి. కానీ వాటినే మన గుర్తింపుగా మార్చుకోవద్దు.

గౌరవమే బంధం
ఎవరికి ఎన్ని రహస్యాలు తెలుసన్నది స్నేహాన్ని నిర్ణయించదు. ఒకరిపై ఒకరికి ఉన్న గౌరవం, నమ్మకం, అర్థం చేసుకునే మనసే అసలైన బలం. నవ్వుకునే సందర్భాల్లోనూ, కష్టకాలంలోనూ ఒకరికొకరు తోడుగా ఉండటమే గొప్ప విషయం. గోప్యతకు చోటిచ్చే స్నేహాలే ఎక్కువకాలం నిలుస్తాయి.
Advertisement
Best Friend
Relationship Advice
Personal Privacy
Password Security
Healthy Friendship
Life Tips

More Telugu News