నన్ను అడ్డుకుంటే ఆమరణ దీక్షకు దిగుతా: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

RS Praveen Kumar warns of hunger strike if stopped from attending BRS meeting
  • కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ యువ సంగ్రామ సదస్సు
  • సబితా ఇంద్రారెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్
  • హైకోర్టు అనుమతులు ఉన్నా అడ్డుకుంటున్నారని ప్రవీణ్ కుమార్ మండిపాటు

తెలంగాణలో నిరుద్యోగుల సమస్యలపై, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల విఫలతపై గళమెత్తేందుకు బీఆర్ఎస్ చేపట్టిన 'యువ సంగ్రామ సదస్సు' తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. సరూర్ నగర్ స్టేడియంలో మరికాసేపట్లో ప్రారంభం కానున్న ఈ సదస్సుపై ప్రభుత్వం తొలుత ఆంక్షలు విధించింది. దీంతో, బీఆర్ఎస్ ఏకంగా హైకోర్టు మెట్లెక్కి మరీ న్యాయబద్ధంగా అనుమతి తెచ్చుకుంది. అయితే సభ ప్రారంభానికి ముందే పోలీసులు చర్యలు చేపట్టారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌లను పోలీసులు వారి ఇళ్లలోనే హౌస్ అరెస్టు చేశారు.


ఈ నిర్బంధంపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ తన నివాసం నుండి ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఇవాళ ఉదయాన్నే పోలీసులు తనను అరెస్టు చేయడానికి ఇంటికి వచ్చారని ఆయన మండిపడ్డారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతున్న యువ సంగ్రామ సదస్సుకు తాను వెళ్లాల్సి ఉందని, దానికి హైకోర్టు అనుమతి కూడా ఉందని చెప్పినా పోలీసులు వినలేదన్నారు. తమకు పైనుంచి ఆదేశాలు ఉన్నాయని, మిమ్మల్ని ఎక్కడికీ పోనివ్వద్దని పోలీసులు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయస్థానం పర్మిషన్ ఇచ్చినా కూడా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నారని ధ్వజమెత్తారు.


రాష్ట్రంలో కొనసాగుతున్న ఈ నిర్బంధకాండ నాడు ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ రోజులను తలపిస్తోందని ప్రవీణ్ కుమార్ దుయ్యబట్టారు. ఒకవైపు ఇలాంటి అరాచకాలకు పాల్పడుతూనే, మరోవైపు సిగ్గు లేకుండా ప్రజా పాలన అని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వద్దే హోంశాఖను పెట్టుకుని, మొదటి నుంచీ బీఆర్ఎస్ సభలకు ఆటంకాలు సృష్టిస్తూనే ఉన్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎలాంటి కుట్రలు చేసినా తాను పోలీసుల ఆంక్షలు దాటుకుని సదస్సుకు వెళ్లి తీరుతానని స్పష్టం చేశారు. ఒకవేళ తనను ఇంటి నుంచి కదలనివ్వకుండా బలవంతంగా అడ్డుకుంటే అక్కడికక్కడే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు.

Advertisement
RS Praveen Kumar
Yuva Sangrama Sadassu
BRS Party Telangana
RS Praveen Kumar House Arrest
Revanth Reddy Government
Saroornagar Stadium Meeting

More Telugu News