పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి తొందర్లోనే శుభవార్త: సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy says good news soon regarding Palamuru Rangareddy Lift Irrigation Project
  • 90 టీఎంసీల నీటి వినియోగానికి అనుమతులు సాధిస్తామని వెల్లడి
  • మహబూబ్‌నగర్‌లో అమర రాజా తయారీ యూనిట్‌ను ప్రారంభించిన రేవంత్
  • పరిశ్రమల్లో స్థానికులకే అత్యధిక ఉద్యోగాలు ఇవ్వాలని సూచన
  • పాలమూరును ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దుతామని హామీ
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి త్వరలోనే శుభవార్త వింటారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లా దివిటిపల్లిలో 'అమర రాజా గ్రూప్' నెలకొల్పిన తయారీ యూనిట్‌ను ప్రారంభించిన సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 90 టీఎంసీల నీటిని వినియోగించుకునేలా కేంద్రంతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఒప్పించి, అవసరమైన అనుమతులు సాధించే దిశగా అడుగులు వేస్తున్నామని ప్రకటించారు. అదేవిధంగా, డిండి ప్రాజెక్టుకు 30 టీఎంసీల నీటి కేటాయింపులపై కూడా చర్చలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.

కృష్ణా బేసిన్‌ పరిధిలోని దిండి, పాలమూరు-రంగారెడ్డి, కల్వకుర్తి తదితర ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసి ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాను సస్యశ్యామలం చేసే బాధ్యతను తాను స్వీకరిస్తానని సీఎం హామీ ఇచ్చారు. అత్యంత వెనుకబడిన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నిలిపి, ఒక ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పరిశ్రమల స్థాపన కోసం భూములిచ్చిన రైతులకు తగిన న్యాయం జరగాలని, అలాగే స్థానిక యువతకే గరిష్ట స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించాలని యాజమాన్యానికి సూచించారు.

అంతకుముందు, అమర రాజా గిగా కారిడార్‌లో ఏర్పాటు చేసిన 'కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంట్' తయారీ యూనిట్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. పర్యావరణ మార్పుల నేపథ్యంలో కాలుష్య నియంత్రణకు ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వినియోగం పెరగాల్సిన అవసరం ఉందని, ఈ తరుణంలో బ్యాటరీల తయారీ యూనిట్‌ను ఇక్కడ స్థాపించడం ముదావాహమని పేర్కొన్నారు. స్థానిక యువతకు పెద్దపీట వేస్తూ ఉపాధి కల్పిస్తున్న అమర రాజా సంస్థ యాజమాన్యాన్ని ఈ సందర్భంగా ఆయన అభినందించారు.

రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో 'తెలంగాణ రైజింగ్ 2047' ప్రణాళికను రూపొందించామని, పారిశ్రామిక విధానాల్లో మరిన్ని సంస్కరణలు తీసుకొచ్చామని సీఎం వివరించారు. అంతర్జాతీయ సంస్థలతో పోటీ పడుతూ అమరరాజా గ్రూప్ దేశానికి గర్వకారణంగా నిలుస్తోందని ఆయన ప్రశంసించారు.
Advertisement
Revanth Reddy
Palamuru Rangareddy Lift Irrigation Project
Amara Raja Giga Corridor
Telangana Rising 2047

More Telugu News