అది రాష్ట్ర ద్రోహం, దేశ ద్రోహంతో సమానం: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Slams Previous Govt Calling Irrigation Neglect Treason
  • మూడేళ్లలో 36 సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటన
  • రూ. 35 వేల కోట్ల బడ్జెట్‌తో పనులు చేపడతామని వెల్లడి
  • రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టును మార్చి 2027 నాటికి పూర్తి చేస్తామని స్పష్టం
  • గత ఐదేళ్లలో ప్రాజెక్టుల నిర్వహణ పూర్తిగా విఫలమైందని విమర్శలు
  • కేఎల్ రావు జయంతి, పట్టిసీమ జలహారతి కార్యక్రమంలో కీలక హామీలు
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలో కృష్ణా-గోదావరి పవిత్ర సంగమం వేదికగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గత ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును పూర్తిగా నిర్వీర్యం చేయడం రాష్ట్ర ద్రోహం, దేశ ద్రోహంతో సమానమని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. డాక్టర్ కేఎల్ రావు 124వ జయంతి వేళ, పట్టిసీమ నుంచి కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన 'జలహారతి' కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. గత ఐదేళ్ల పాలనలో సాగునీటి రంగంపై నిర్లక్ష్యం చూపారంటూ గణాంకాలతో సహా ఎండగట్టారు. ఒక వ్యక్తి ప్రాధాన్యతల కోసం రాష్ట్ర ప్రజల భవిష్యత్తును, రైతాంగ ప్రయోజనాలను ఫణంగా పెట్టారని తీవ్రంగా ఆరోపించారు.

విమర్శలనే కాదు.. వారి మోసాన్ని మ్యూజియంలో పెడతా

గత ప్రభుత్వ వైఫల్యాలను ఏకరువు పెట్టిన చంద్రబాబు, వారి పాలనలో జరిగిన మోసపూరిత చర్యలను తీవ్రంగా ఖండించారు. "వెలిగొండ ప్రాజెక్టు పనులు పూర్తికాకుండానే, సొరంగంలో యంత్రం ఇరుక్కుపోయిన విషయాన్ని దాచిపెట్టి, ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తున్నట్లు బోర్డు పెట్టి నాటకాలడారు. ప్రజలను ఇంత దారుణంగా మోసం చేస్తారా? వారి మోసానికి ప్రతీక అయిన ఆ ప్రారంభోత్సవ బోర్డును మ్యూజియంలో పెట్టి, ప్రజలకు శాశ్వతంగా గుర్తుండేలా చేస్తాను" అని సంచలన వ్యాఖ్యలు చేశారు. 

2019-24 మధ్య కాలంలో ప్రాజెక్టుల గేట్లకు కనీసం గ్రీజు కూడా పూయని దుస్థితి ఉండేదని, పులిచింతల, గుండ్లకమ్మ గేట్లు కొట్టుకుపోయినా పట్టించుకోలేదని విమర్శించారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో పనులు చేసేందుకు ఎవరూ ముందుకు రాని దారుణమైన పరిస్థితిని సృష్టించారని మండిపడ్డారు.

తాము ఎంతో కష్టపడి పూర్తి చేసిన పట్టిసీమ ప్రాజెక్టును 'వట్టిసీమ', 'దండగ' అని ఆనాడు ప్రతిపక్షంలో ఉండి విమర్శించిన వారే, అధికారంలోకి వచ్చాక దాని విలువను గుర్తించలేకపోయారని అన్నారు. "నేను ఆ రోజు వారి విమర్శలకు భయపడి ఉంటే, ఈ పదేళ్లలో కృష్ణా డెల్టా పరిస్థితి ఏమై ఉండేదో ఒక్కసారి ఆలోచించండి. పట్టిసీమ ద్వారా గడిచిన పదేళ్లలో 450 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణాకు తరలించి 13 లక్షల ఎకరాలను స్థిరీకరించాం" అని చంద్రబాబు స్పష్టం చేశారు.

36 ప్రాజెక్టులు, 3 సంవత్సరాలు

విమర్శలకే పరిమితం కాకుండా, రాష్ట్రాన్ని జల సమృద్ధంగా మార్చేందుకు తమ ప్రభుత్వ బృహత్ ప్రణాళికను చంద్రబాబు ఆవిష్కరించారు. రాబోయే మూడేళ్లలో రాష్ట్రంలోని 36 కీలక సాగునీటి ప్రాజెక్టులను రూ.35 వేల కోట్ల వ్యయంతో పూర్తి చేస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా పలు ప్రాజెక్టుల పూర్తికి స్పష్టమైన గడువులను నిర్దేశించారు.

"రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. ఇప్పటికే 37 సార్లు భౌతికంగా, 37 సార్లు వర్చువల్‌గా సమీక్షలు నిర్వహించాను. పునరావాసంపై ప్రత్యేక దృష్టి సారించి నిర్వాసితులకు న్యాయం చేస్తాం" అని హామీ ఇచ్చారు. తాను 1996లో శంకుస్థాపన చేసిన వెలిగొండ ప్రాజెక్టు తొలిదశను ఈ ఏడాది సెప్టెంబర్ 1న ప్రారంభిస్తామని తెలిపారు. 

వీటితో పాటు వంశధార-నాగావళి-గోదావరి-కృష్ణా-పెన్నా నదుల అనుసంధానం తన చిరకాల స్వప్నమని, దానిని సాకారం చేసే దిశగా అడుగులు వేస్తామని పునరుద్ఘాటించారు. గుంటూరు ఛానల్ ఆధునికీకరణ, చింతలపూడి ఎత్తిపోతల, వరికపూడిశెల వంటి అనేక ప్రాజెక్టుల పూర్తికి నిర్దిష్ట తేదీలను ప్రకటించి, ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని చాటుకున్నారు.

మహనీయుల స్ఫూర్తితో ముందుకు

ఈ సందర్భంగా డాక్టర్ కేఎల్ రావు, సర్ ఆర్థర్ కాటన్, శివరామకృష్ణయ్య, నందమూరి తారక రామారావు వంటి మహనీయులు సాగునీటి రంగానికి చేసిన సేవలను చంద్రబాబు స్మరించుకున్నారు. వారి దూరదృష్టి వల్లే ఈరోజు రాష్ట్రం అన్నపూర్ణగా నిలిచిందన్నారు. మంచి పనులు చేసిన వారిని ప్రజలు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారని, చెడును ఖండించాల్సిన బాధ్యత కూడా ప్రజలపై ఉందని హితవు పలికారు. 

తాము అధికారంలోకి వచ్చాక ధవళేశ్వరం, తుంగభద్ర బ్యారేజీల గేట్లను యుద్ధప్రాతిపదికన మార్పించామని, నిర్వహణ లోపాలను సరిదిద్దుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేఎల్ రావు కుమారుడు విజయరావు కోరిన వైకుంఠపురం బ్యారేజీ నిర్మాణాన్ని కూడా తప్పకుండా చేపడతామని హామీ ఇచ్చారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో నీటిని పొదుపుగా వాడుకోవాలని, జల సంరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని సీఎం పిలుపునిచ్చారు.
Advertisement
Chandrababu Naidu
Polavaram Project
Andhra Pradesh Irrigation
Pattiseema Lift Irrigation
Pavitra Sangamam
AP Water Resources

More Telugu News