పోక్సో నిందితుడికి అతడి వల్లే బెయిల్.. ఇదేనా మహిళల రక్షణ?: ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్
- రాష్ట్రంలో ఆడబిడ్డలను కాపాడుకునే నాథుడే కరవయ్యాడన్న ప్రవీణ్ కుమార్
- షాబాద్ పోక్సో నిందితుడికి ముందస్తు బెయిల్ వచ్చేంత వరకు కాలయాపన చేశారని మండిపాటు
- బాధిత కుటుంబాలను ఓదార్చడానికి వెళుతున్న తమను అరెస్ట్ చేశారని విమర్శ
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో మహిళల భద్రత పూర్తిగా గాలికి కొట్టుకుపోయిందని, ఆడబిడ్డలను కాపాడుకునే నాథుడే కరవయ్యాడని బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో రంగారెడ్డి జిల్లా షాబాద్ దారుణ ఉదంతంపై ఆయన మాట్లాడారు. ఈ కేసులో ప్రభుత్వం, పోలీసులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ వ్యవహరించిన తీరు సరిగా లేదని ఆరోపించారు.
మే 16వ తేదీనే బాధిత బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసిందని... నిందితుడు ఎవరో, ఏం చేశాడో వివరించినా పోలీసులు పట్టించుకోలేదన్నారు. నిందితుడు ముందస్తు బెయిల్ తెచ్చుకునే వరకు కూడా అతన్ని అరెస్ట్ చేయకుండా కాలయాపన చేశారని మండిపడ్డారు.
ఎల్‌బీ నగర్ పోక్సో కోర్టు ఇచ్చిన బెయిల్ ఆర్డర్‌ను తాను పరిశీలించానని, అందులో చనిపోయిన బాలిక సోదరుడు బెయిల్‌ను వ్యతిరేకించినట్లు ఉందని ప్రవీణ్ కుమార్ చెప్పారు. కానీ, అసలు ఆ బాలికకు అన్నే లేడని, కేవలం ఒక అక్క మాత్రమే ఉందని పేర్కొంటూ.. లేని అన్న వచ్చి బెయిల్ వద్దని ఎలా చెబుతాడని ప్రశ్నించారు.
పోక్సో రూల్స్ 2020 ప్రకారం నిందితుడు బెయిల్‌కు దరఖాస్తు చేసుకుంటే బాధితులకు నోటీసు ఇవ్వాలి. కానీ ఇక్కడ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ఉన్న వ్యక్తి కాంగ్రెస్ లీగల్ సెల్ వైస్ ప్రెసిడెంట్ బిక్షపతి గౌడ్ అని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ నాయకుడి వల్లే షాబాద్ పోక్సో నిందితుడు రాజ్ కుమార్‌కు బెయిల్ వచ్చిందని, ఇలాంటి వారికి పీపీ పోస్టులు ఇస్తే మహిళలకు న్యాయం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు.
బాధిత కుటుంబాన్ని ఓదార్చడానికి వెళుతున్న తమను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని, ఇదే ఉత్సాహం నిందితులను అరెస్ట్ చేయడంలో ఎందుకు చూపించడం లేదని నిలదీశారు.