షేన్ నిగమ్ కి మలయాళంలో మంచి క్రేజ్ ఉంది. ఆయన ఎంచుకునే కథలు .. పాత్రలు చాలా విభిన్నంగా ఉంటాయి. ఆయన కథానాయకుడిగా నటించిన సినిమానే 'బాల్టి'. ఉన్ని శివలింగం దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామాను, మలయాళంతో పాటు తమిళంలోను విడుదల చేశారు. సాయి అభ్యంకర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, క్రితం ఏడాది సెప్టెంబర్ 26వ తేదీన థియేటర్లకు వచ్చింది. ఈ నెల 10వ తేదీ నుంచి ఈ సినిమా 'సోనీ లివ్'లో తెలుగులోను స్ట్రీమింగ్ అవుతోంది.
కేరళ - తమిళనాడు సరిహద్దు ప్రాంతంలోని ఒక టౌన్ అది. అక్కడ ఉదయ్ (షేన్ నిగమ్) తన తల్లితో కలిసి నివసిస్తూ ఉంటాడు. అతని స్నేహితులే రమేశ్ .. మణి .. కుమార్. ఈ నలుగురు స్నేహితులు కబడ్డీ బాగా ఆడతారు. మంచి - చెడు ఏదైనా ఈ నలుగురు స్నేహితులు కలిసే ఉంటారు. స్పోర్ట్స్ కోటాలో జాబ్ వస్తుందనే ఆశతో ఉదయ్ తల్లి ఉంటుంది. ఉదయ్ కి మనసిచ్చిన 'కావేరి' (ప్రీతీ అస్రాని) కూడా అతనితో అందమైన జీవితాన్ని ఊహించుకుంటూ ఉంటుంది. అయితే ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉందనే సంగతి ఆ సమయంలో ఆమెకి తెలియదు.
ఆ ప్రాంతంలో భైరవ (సెల్వ రాఘవన్) వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు. ఎక్సెల్ వడ్డీ .. లార్జ్ వడ్డీ .. జంబో వడ్డీ అంటూ అతను దోచేస్తూ ఉంటాడు. అతని ప్రధానమైన అనుచరులుగా ముత్తు - తమ్ముడు మూర్తి ఉంటారు. బాకీ తీర్చకపోతే అతను పెట్టే టార్చర్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇక అదే టౌన్ లో 'సోడా' ఫ్యాక్టరీని నడుపుతుంటాడు సోడాబాబు(అల్ఫోన్స్). అతను కాలేజ్ స్టూడెంట్స్ కి మాత్రమే అప్పు ఇస్తుంటాడు. తన తండ్రి పెరుమాళ్లును చంపిన భైరవపై అతను పగతో ఉంటాడు. ప్రతీకారం తీర్చుకునే సమయం కోసం వెయిట్ చేస్తుంటాడు.
ఇక అదే ఏరియాలో 'జీమా' (పూర్ణిమ ఇంద్రజిత్) కూడా వడ్డీ వ్యాపారమే చేస్తుంటుంది. లేడీస్ కి మాత్రమే అప్పుడు ఇవ్వడం ఆమెకి అలవాటు. అటు భైరవతోను .. ఇటు సోడాబాబుతోను ఆమెకి గొడవలు ఉంటాయి. అలాంటి పరిస్థితులలో కబడ్డీ ఆటగాళ్లైన ఈ నలుగురు యువకులను భైరవ చేరదీస్తాడు. వాళ్లకి తెలియకుండానే రౌడీయిజంలోకి దింపుతాడు. ఫలితంగా వాళ్ల జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతుంది? అనేది మిగతా కథ.
కబడ్డీ ఆటలో రాణిస్తూ పేరు తెచ్చుకున్న నలుగురు స్నేహితులు, జీవితంలో స్థిరపడాలనే ఉత్సాహంతో ఉంటారు. అందమైన భవిష్యత్తును గురించి కలలు కంటారు. అలాంటివాళ్లు అనుకోకుండానే రౌడీయిజం వైపు వెళతారు. తప్పుడు దారిలో వెళ్లిన ఆ నలుగురు స్నేహితులు ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది? అనేదే ఈ కథలో ప్రధానమైన అంశం. కొన్ని మాఫియా ముఠాలు ఫైనాన్స్ కంపెనీల పేరుతో, ఎంతమంది జీవితాలను నాశనం చేస్తున్నారనే పాయింట్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది.
చిరు వ్యాపారులకు వడ్డీకి ఇచ్చేవాళ్లు కొందరు .. వ్యాపారం చేసుకునే లేడీస్ కి మాత్రమే వడ్డీలకు ఇచ్చేవాళ్లు కొందరు .. ఇక కాలేజ్ స్టూడెంట్స్ కి మాత్రమే వడ్డీలకు ఇచ్చేవాళ్లు మరికొందరు. ఇలా ఒక ప్లాన్ ప్రకారం వడ్డీ వ్యాపారాలు చేస్తూ .. కుటుంబాలను కొల్లగొట్టే ముఠాలను గురించిన వైనాన్ని కళ్లకు కట్టే ప్రయత్నం చేశాడు దర్శకుడు. మదర్ సెంటిమెంట్ .. లవ్ .. ఫ్రెండ్షిప్ ను లైట్ గా టచ్ చేస్తూనే దర్శకుడు ఈ కథను కనెక్ట్ చేసిన తీరు మెప్పిస్తుంది.
నలుగురు స్నేహితులపై హోటల్లో రౌడీ గ్యాంగ్ ఎటాక్ చేసే సీన్, సోడాబాబు ఫ్యాక్టరీలో ఫైట్ సీన్ .. భైరవ దగ్గరికి కావేరి వెళ్లే సీన్ .. లాడ్జ్ లో దాక్కున్న స్నేహితులపై రౌడీలు దాడి చేయడం .. నడి రోడ్డుపై రౌండప్ చేయడం వంటి సన్నివేశాలు ఈ సినిమా హైలైట్స్ లో చోటు సంపాదించుకుంటాయి. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకూ ఆడియన్స్ అలా చూస్తూ కూర్చుండిపోతారు. అంతటి ఉత్కంఠభరితంగా సన్నివేశాలు పరిగెడతాయి.
షేన్ నిగమ్ .. అతని స్నేహితుల పాత్రలను పోషించిన వాళ్లంతా చాలా సహజంగా నటించారు. విలన్ గా సెల్వ రాఘవన్ నటన కొత్తగా అనిపిస్తూ మార్కులు కొట్టేస్తుంది. అల్ఫోన్స్ .. పూర్ణిమ ఇంద్రజిత్ నటన కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. అలెక్స్ ఫొటోగ్రఫీ .. సాయి అభ్యంకర్ నేపథ్య సంగీతం .. శివకుమార్ ఎడిటింగ్ గొప్ప పనితీరును కనబరుస్తాయి.
ఈ కథలో కబడ్డీ ఎపిసోడ్స్ బోర్ కొట్టేలా ఉండవు. రెండుసార్లు మాత్రమే కబడ్డీని చూపిస్తారు .. అది కూడా కథకి అవసరమైన సందర్భాలలో మాత్రమే. ఆ తరువాత దారి మారిన కారణంగా కబడ్డీ ఆటగాళ్లైన నలుగురు స్నేహితుల జీవితాలు ఎలా ప్రభావితమయ్యానే అంశం చుట్టూనే ఈ కథ నడుస్తుంది. ఈ కథ ఆలోచింపజేస్తుంది .. కన్నీళ్లు పెట్టిస్తుంది .. మనం ఎంచుకునే మార్గమే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది అనే సందేశాన్ని ఇస్తుంది.
కథ .. స్క్రీన్ .. పాత్రలను మలచిన విధానం .. సన్నివేశాలను ఆసక్తికరంగా ఆవిష్కరించిన తీరు .. లొకేషన్స్ .. మేనరిజమ్స్ .. ఇలా అన్నీ కుదిరిన కంటెంట్ గా ఈ సినిమాను గురించి చెప్పుకోవచ్చు. ఈ మధ్య కాలంలో వచ్చిన ఒక ఇంట్రెస్టింగ్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా నిలిచిపోతుందని చెప్పొచ్చు.
'బాల్టి' (సోనీ లివ్) మూవీ రివ్యూ!
Balti Review
Movie Details
Movie Name: Balti
Release Date: 2026-07-10
Cast: Shane Nigam, Shanthanu Bhagyaraj, Preethi Asrani, Poornima Indrajith,
Director: Unni Sivalingam
Music: Sai Abhyankkar
Banner: STK Frames
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer