అమెరికా మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్స్‌ జాబితాలో నితీశ్‌ కౌశల్‌.. ఎవరితడు?

Nitish Kaushal added to FBI Most Wanted criminals list
  • జగ్గు భగవాన్‌పురియా గ్యాంగ్‌తో సంబంధాలున్నట్లు ఆరోపణలు
  • హత్యలు, కిడ్నాప్‌లు, డ్రగ్స్‌ కేసుల్లో ప్రమేయం ఉందని ఆరోపణ
  • నితీశ్‌ను అత్యంత ప్రమాదకర వ్యక్తిగా పేర్కొన్న ఎఫ్‌బీఐ
  • అతడిపై 2026 జూన్‌ 25న అరెస్ట్‌ వారెంట్‌ జారీ
  • ‘ఆపరేషన్‌ హార్డ్‌ బాల్‌’లో భాగంగా చర్యలు
అమెరికాలో అంతర్జాతీయ నేర ముఠాలపై ఎఫ్‌బీఐ చర్యలను మరింత వేగవంతం చేసింది. తాజాగా భారత మూలాలున్న నితీశ్‌ కౌశల్‌ను మోస్ట్‌ వాంటెడ్‌ నేరస్థుల జాబితాలో చేర్చింది. హత్యలు, కిడ్నాప్‌లు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వసూళ్లు, ఆయుధాల అక్రమ రవాణా, మనీలాండరింగ్‌, మానవ అక్రమ రవాణా వంటి నేరాల్లో అతనికి ప్రమేయం ఉన్నట్లు ఆరోపించింది.

ఎఫ్‌బీఐ వివరాల ప్రకారం నితీశ్‌ కౌశల్‌కు జగ్గు భగవాన్‌పురియా ఆర్గనైజ్డ్‌ క్రిమినల్‌ గ్రూప్‌తో సంబంధాలు ఉన్నాయి. పంజాబ్‌లో ప్రారంభమైన ఈ ముఠా అమెరికాలోని కాలిఫోర్నియా సెంట్రల్‌ జిల్లా సహా పలు ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఈ నేర ముఠా తరఫున నితీష్‌ కౌశల్‌ కిడ్నాప్‌లు, దాడుల వంటి హింసాత్మక చర్యల్లో నేరుగా పాల్గొన్నట్లు దర్యాప్తులో తేలిందని ఎఫ్‌బీఐ వెల్లడించింది.

నితీశ్‌ కౌశల్‌ వద్ద ఆయుధాలు ఉండే అవకాశం ఉందని, అతను అత్యంత ప్రమాదకర వ్యక్తిగా పరిగణించాలని ఎఫ్‌బీఐ హెచ్చరించింది. పరారయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉందని పేర్కొంది. అతడి ఆచూకీ తెలిసిన వారు సమీప ఎఫ్‌బీఐ కార్యాలయానికి లేదా అమెరికా రాయబార కార్యాలయం, కాన్సులేట్‌కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

నితీశ్‌ కౌశల్‌పై 2026 జూన్‌ 25న కాలిఫోర్నియా సెంట్రల్‌ జిల్లా కోర్టు అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసింది. ‘రాకెటీరింగ్‌ ఇన్‌ఫ్లుయెన్స్‌డ్‌ అండ్‌ కరప్ట్‌ ఆర్గనైజేషన్స్‌ (RICO)’ చట్టం కింద కుట్ర ఆరోపణలు నమోదు చేసింది. జగ్గు భగవాన్‌పురియా నెట్‌వర్క్‌ను లక్ష్యంగా చేసుకుని చేపట్టిన ‘ఆపరేషన్‌ హార్డ్‌ బాల్‌’లో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అమెరికా, కెనడా, యూరప్‌లో ఈ ముఠాపై దాడులు, అమలు చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.
Advertisement
Nitish Kaushal
FBI Most Wanted
Jaggu Bhagwanpuria gang
Operation Hard Ball
California Central District
Indian origin criminal

More Telugu News