స్థానిక ఎన్నికల నేపథ్యంలో కర్నూలులో భారీగా నగదు పట్టుబడింది. ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు నిర్వహించిన సోదాల్లో ఓ వ్యక్తి ఇంట్లో రూ.76 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన నగరంలో కలకలం రేపింది.

వివరాల్లోకి వెళితే... ఎన్నికల సందర్భంగా పోలీసులు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా కర్నూలు నగరంలోని నాగిరెడ్డి రెవెన్యూ కాలనీలో అధికారులు సోదాలు చేపట్టారు. ఈ క్రమంలో అమర్నాథ్‌రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో రూ.76 లక్షల నగదును గుర్తించారు.

అంత పెద్ద మొత్తంలో ఉన్న డబ్బుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు, పత్రాలు చూపించకపోవడంతో అధికారులు ఆ నగదును సీజ్ చేశారు. పట్టుబడిన అమర్నాథ్‌రెడ్డి... 27వ వార్డు వైసీపీ అభ్యర్థి బెల్లం మహేశ్వర్‌రెడ్డికి స్నేహితుడిగా పోలీసులు భావిస్తున్నారు. దీంతో ఈ నగదు ఎన్నికల్లో పంపిణీ చేసేందుకు ఉద్దేశించిందా అనే కోణంలో అధికారులు విచారణ జరుపుతున్నారు.