భారత్‌లో నివసిస్తున్న ఒక రష్యా యువతి తనకు ఎదురైన ఐదు ముఖ్యమైన సాంస్కృతిక అనుభవాలను వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. భారతదేశ జీవనశైలికి అలవాటుపడే క్రమంలో తనకు ఎదురైన చిన్న చిన్న ఇబ్బందులను ఆమె ఇందులో సరదాగా పంచుకున్నారు. రష్యా, భారతీయ సంప్రదాయాల మధ్య ఉన్న వైవిధ్యం కారణంగా తాను ఎదుర్కొన్న ఆసక్తికర పరిణామాలను ఆమె ఈ వీడియోలో వివరించారు.

భారత్‌లోని తన జీవితానుభవాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకునే అనస్తాసియా షరోవా, ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను పోస్ట్ చేశారు. భారతీయ రోడ్లపై వాహనాల రాకపోకల సమయంలో హెడ్‌‍లైట్ల వినియోగం గురించి ఆమె ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. రష్యాలో హెడ్‌లైట్లు వెలిగిస్తే ఎదుటి వాహనానికి "ముందు మీరు వెళ్లండి" అని మర్యాదపూర్వకంగా చెప్పడం అని అర్థం. కానీ, భారత్‌లో దీనికి పూర్తి భిన్నంగా "నేను ఆగను, నాకే దారి ఇవ్వండి" అనే అర్థంలో వాడతారని ఆమె గ్రహించారు. అదేవిధంగా, బంధువులు లేదా స్నేహితుల ఊరికి వెళ్లినప్పుడు వారి ఇంట్లో కాకుండా హోటల్‌లో బస చేస్తే ఇక్కడ చిన్నచూపు చూస్తారని ఆమె పేర్కొన్నారు.

భావవ్యక్తీకరణ విషయంలోనూ కొన్ని వ్యత్యాసాలను ఆమె గమనించారు. వృత్తిపరమైన విషయాల్లో సైతం టెక్స్ట్ మెసేజ్‌ల కంటే నేరుగా ఫోన్ కాల్స్ చేయడానికే ఇక్కడ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని, ఇది ప్రారంభంలో తనకు కొంత అసహనం కలిగించిందని చెప్పారు. ఇక ఎవరైనా ఏదైనా విషయానికి 'సరే' అని చెబితే, అది కేవలం మర్యాద కోసం చెప్పిన సమాధానమే కావొచ్చు కానీ, ఆ పని కచ్చితంగా చేస్తారని భావించలేమని ఆమె తన అనుభవంతో వివరించారు.

రష్యాలో పెద్దలను సైతం పేరు పెట్టి పిలవడం గౌరవప్రదంగా భావిస్తారని, కానీ భారత్‌లో ఉపాధ్యాయులను లేదా పెద్దలను పేరుతో పిలిస్తే అగౌరవంగా పరిగణిస్తారని ఆమె తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియోకు వేల సంఖ్యలో లైకులు వస్తుండగా, నెటిజన్లు ఇరు దేశాల మధ్య ఉన్న ఈ సాంస్కృతిక వైవిధ్యంపై ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.